శ్రీశ్రైలంలో చిరుత సంచారం
భయాందోళనలో గ్రామస్తులు
ఆలయ ఏఈవో ఇంటి వద్ద సీసీ కెమెరాలో రికార్డు
అంతకుముందు సున్నిపెంటలోనూ సంచారం
రాత్రివేళ అప్రమత్తంగా ఉండాలంటున్న అధికారులు
నంద్యాల జిల్లా శ్రీశైలం ప్రాంతాన్ని చిరుతపులులు వదలడం లేదు. ఏదో ఒకచోట కనిపిస్తూనే ఉన్నాయి. నిన్న మొన్నటివరకు శ్రీశైలం ఘాట్ రోడ్డులో చిరుతపులులు భక్తులకు కనిపించేవి. కానీ ఇప్పుడు ఏకంగా ఇళ్లల్లోకి గోడలు దూకి రావడంతో స్థానికులు వణికిపోతున్నారు. తాజాగా పాతాళగంగ మార్గంలోని ఆలయ ఏఈవో ఇంటి వద్ద మంగళవారం తెల్లవారుజామున చిరుత సంచారం కనిపించింది. ఏఈవో ఇంటి ప్రహరీ గోడపై నడుచుకుంటూ వచ్చి కుక్కను ఎత్తుకెళ్లడం అక్కడి సీసీ కెమెరాలో నమోదైంది. అంతకు ముందు పరిసర ఇళ్ల వరకు వచ్చిన చిరుత సంచరించినట్లు వీడియో ఫుటేజీలో కనిపించింది.
సున్నిపెంట రామాలయం సమీపంలోనూ…
కొన్ని రోజుల క్రితం శ్రీశైలం సమీపంలోని సున్నిపెంట గ్రామం పరిధిలోని రామాలయం ఆలయం సమీపంలో చిరుతపులి జనసంచారంలోకి వచ్చి, ఓ ఇంట్లో పెంచుకుంటున్న పెంపుడు కుక్కలపై దాడి చేసింది. ఇంటి ఆవరణలోకి వచ్చిన చిరుత కుక్కలను చంపి ఎత్తుకెళ్లింది. ఆలయ ఏఈవో ఫిర్యాదు చేయడంతో అటవీశాఖ అధికారులు ఘటనా స్థలాన్ని పరిశీలించి చిరుత కోసం వేట మొదలుపెట్టారు. స్థానికులు రాత్రివేళల్లో అప్రమత్తంగా ఉండాలని, ఒంటరిగా బయటకు వెళ్లవద్దని సూచించారు.