తిరుపతి, ప్రభన్యూస్‌బ్యూరో (రాయలసీమ) : ” రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టి రాష్ట్రంలోని యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వపరంగా పూర్తి సహకారం ఉంటుంది. రాష్ట్రంలో పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చేవారికి పూర్తిస్ధాయిలో సహకరించడానికి మా ప్రభుత్వం సిద్ధంగా ఉంటుంది. పరిశ్రమల స్ధాపనకు సంబంధించి ఎటువంటి సమస్యలు ఉన్నా ఒక్క ఫోన్‌కాల్‌చేస్తే పరిష్కరించడానికి అవసరమైన చర్యలు తీసుకుంటాం.” అని రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. తిరుపతి జిల్లా పర్యటనలో భాగంగా ఆయన గురువారం రూ. 3 వేల కోట్ల పెట్టుబడులతో ఏర్పాటైన మూడు పరిశ్రమలను ప్రారంభించారు. మరో రూ.వెయ్యి కోట్ల పెట్టుబడులతో ఏర్పాటు కానున్న మూడు పరిశ్రమలకు శంకుస్థాపనలు చేసారు. ఆ సందర్భంగా జగన్‌మోహన్‌రెడ్డి ఇనగలూరులో, రేణిగుంట వద్ద పారిశ్రామిక వేత్తలను, పరిశ్రమల ప్రతినిధులను ఉద్దేశించి ప్రసంగించారు. సుప్రసిద్ధ ఆడిదాస్ బూట్లను తయారు చేసే అపాచీ సంస్ధ తొలి యూనిట్‌ను తన తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 2006లో తడ వద్ద శంకుస్ధాపన చేయగా 2020లో పులివెందులలో రెండో యూనిట్‌కు, ప్రస్తుతం ఏర్పేడు-వెంకటగిరి మార్గంలోని ఇనగలూరు వద్ద మూడో యూనిట్‌కు శంకుస్ధాపన చేసే అవకాశం తనకు లభించిందన్నారు. తడ యూనిట్‌లో ఉపాధి పొందుతున్న 15 వేల మందిలో 60 శాతం మహిళలు కావడం సంతోషించతగిన విషయమన్నారు. 2 వేల మందికి ఉపాధి కల్పించే పులివెందుల యూనిట్‌కు 2023 మార్చినెలలో, ప్రస్తుతం శంకుస్ధాపన చేసిన ఇనగలూరు యూనిట్‌కు 2023 సెప్టెంబర్‌లో ప్రారంభోత్సవాలు జరగనున్నాయన్నారు. ఈ రెండు యూనిట్ల ద్వారా 12 వేల మందికి ఉపాధి లభించడం సంతోషం కలిగిస్తోందన్నారు. రూ.700 కోట్ల పెట్టుబడితో ఇనగలూరులో ఏర్పాటు కానున్న అపాచీ యూనిట్ ద్వారా ఉపాధి పొందే 10 వేల మందిలో 80శాతం మంది మహిళలు ఉంటారని ఆ సంస్ధ ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తం చేసారు. ఇదికాకుండా రేణిగుంట వద్ద నున్న ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్సరింగ్ క్లస్టర్ 1 పరిధిలో రూ.1,230 కోట్ల పెట్టుబడులతో టివి, మొబైల్ ప్యానళ్ల తయారు చేసే ది గ్గజ సంస్ధ టిసిఎల్ అనుబంధ యూనిట్‌కు, రూ.1,050 కోట్ల పెట్టుబడులతో యూఎస్‌బి కేబుళ్లు, సర్క్యూట్ బోర్డులు తయారు చేసే ఫాక్స్ లింక్స్ యూనిట్‌కు, రూ.580 కోట్ల పెట్టుబడులతో సెల్‌ఫోన్ కెమెరా లెన్సులను తయారు చేసే సన్నీ ఒప్పోటెక్ యూనిట్‌కు శంకుస్ధాపన చేయడం ఆనందం కలిగిస్తోందన్నారు. ఈ మూడు యూనిట్ల ద్వారా మరో ఆరునెలల్లో 6,400 మందికి ఉపాధి లభిస్తుందన్నారు. అదేవిధంగా తాను శంకుస్ధాపనలు చేసిన రూ.110 కోట్ల పెట్టుబడితో టివి ఫ్యానల్స్ తయారు చేసే డిక్సన్ యూనిట్, రూ.300 కోట్ల పెట్టుబడితో ఎలక్ట్రానిక్ పరికరాలు తయారుచేసే ఫాక్స్‌లింక్ యూనిట్ల ద్వారా మరో ఏడాదిలోగా 2 వేల మందికి ఉపాధి లభించనున్నదని తెలిపారు. ఈ విధంగా వస్తున్న పరిశ్రమల వల్ల రాష్ట్రం పురోగతి సాధించడంతో పాటు వేలాదిమందికి ఉపాధి అవకాశాలు లభించడానికి తమ ప్రభుత్వం కారణమవుతుండడం భగవంతుని ఆశీస్సులుగానే భావిస్తున్నానన్నారు. మరింత పెట్టుబడులను ఆహ్వానించడం ద్వారా రాష్ట్రంలో యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడానికి పారిశ్రామికవేత్తలకు అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించడంలో తమ ప్రభుత్వం ముందుంటుందన్నారు. ఈ విషయంలో ప్రతి పారిశ్రామికవేత్త తమ ప్రభుత్వం కల్పించే సదుపాయాలను వినియోగించుకుని రాష్ట్ర ప్రగతికి తోడ్పాటు అందించాలని కోరారు. పరిశ్రమల స్ధాపనకు సంబంధించి ఎటువంటి సమస్యలు ఉన్నా ప్రభుత్వం దృష్టికి వెంటనే తీసుకురావచ్చని, వాటిని పరిష్కరించడానికి తమ ప్రభుత్వం, ఉన్నతాధికారులు సన్నద్ధంగా ఉంటారన్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే పరిశ్రమల ఏర్పాటు విషయంలో ఎదురయ్యే సమస్యలను పరిష్కరించడంలో తమ ప్రభుత్వం ఒక్క ఫోన్ కాల్ దూరంలో ఉంటుందని ప్రతి పారిశ్రామికవేత్త గుర్తుంచుకోవాలన్నారు. వీలైనంత వరకు పరిశ్రమల ఏర్పాటుకు సంబంధించి ప్రభుత్వపరమైన సహాయ సహకారాలన్నీ ఒకే చోట లభించేలా తమ ప్రభుత్వం పనిచేస్తుందని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమాలలో భాగంగా పరిశ్రమల స్ధాపనకు సంబంధించి ఒప్పందాలతో పాటు యువతకు అవసరమైన నైపుణ్యశిక్షణ ఇవ్వడానికి ముందుకు వచ్చిన పరిశ్రమల ప్రతినిధులతో, ఆంధ్రప్రదేశ్ ఇన్‌పర్మేషన్ టెక్నాలజీ అకాడెమీ (అపిటా) అధికారులు ఒప్పందాలు (ఎంఓయులు) కుదుర్చుకున్నారు. ప్రారంభోత్సవాలు, శంకుస్ధాపనల కార్యక్రమాల్లో భాగంగా ఆయా యూనిట్‌లు ఏర్పాటు చేసిన ప్రదర్శనలను ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి తిలకించారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement