అనకాపల్లి – : ఫార్మా ప్రమాద మృతులకు రూ.కోటి ఎక్స్‌గ్రేషియా ఇవ్వనున్నట్లు విశాఖ కలెక్టర్ హరిందర్ ప్రసాద్ ప్రకటించారు. అలాగే, చికిత్స పొందుతున్నవారికి కూడా పరిహారం అదించనున్నట్లు ఆయన తెలిపారు..
క్షతగాత్రుల గాయాల తీవ్రతను బట్టి నష్టపరిహారం ఇవ్వనున్నట్లు కలెక్టర్ తెలిపారు. ప్రస్తుతం ఆస్పత్రుల్లో 41 మంది బాధితులు చికిత్స పొందుతున్నారని, మృతుల సంఖ్య పెరిగే అవకాశం లేదని కలెక్టర్ హరిందర్ ప్రసాద్ చెప్పారు.కాగా, అనకాపల్లిజిల్లా రాంబిల్లి మండలం అచ్యుతాపురం సెజ్‌లోని ఎసెన్షియా కంపెనీలో భారీ అగ్నిప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే.
రియాక్టర్ పేలిన ఘటనలో 18 మంది మృతిచెందగా.. దాదాపు 40 మంది వరకు గాయపడ్డారు. రియాక్టర్ పేలడంతో భారీగా మంటలు ఎగసిపడ్డాయి. పెద్ద శబ్దాలతో పేలుడు జరగడంతో కొంతమంది బయటకు పరుగులు తీశారు. దట్టమైన పొగలతో ఉక్కిరిబిక్కిరి అయి కొందరు.. శిథిలాల కిందపడి మరికొందరు ప్రాణాలు కోల్పోయారు.
ఫార్మా కంపెనీల్లో ప్రమాదాలు..
ఫార్మా కంపెనీల్లో ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ప్రాణాలు పోతూనే ఉన్నాయి. యజమాన్యాల అంతులేని నిర్లక్ష్యానికి అమాయక కార్మికులు అన్యాయంగా బలవుతూనే ఉన్నారు. లేటెస్ట్‌గా అచ్యుతాపురం సెజ్‌లోని ఎసెన్షియా కంపెనీలో రియాక్టర్ పేలి 18మంది కాలిబూడిదయ్యారు. మరో 40 మంది గాయపడ్డారు. ప్రమాద సమయంలో 300మందికి పైగా సిబ్బంది ఉన్నారు. వారిలో ఎవరు గాయపడ్డారు, ఎవరు చనిపోయారో తెలియక కంపెనీ ఎదుట బాధిత కుటుంబాలు కన్నీరుమున్నీరవుతున్నాయి.