Saturday, November 23, 2024

అనుమతులు అవసరం లేదు.. ఏపీ, తెలంగాణ‌లో 6 ప్రాజెక్టులకు ఊరట..

అమరావతి, ఆంధ్రప్రభ : రెండు తెలుగు రాష్ట్రాల్లో అనుమతుల్లేని ప్రాజెక్టుల విషయంలో కేంద్ర ప్రభుత్వం భారీ ఊరట కల్పించింది. ఏపీలో నాలుగు, తెలంగాణలోని రెండు ప్రాజెక్టులకు అనుమతులు అవసరం లేదని, నిర్మాణ పనులను నిలుపుదల చేయాల్సిన అవసరం లేదని కేంద్రం స్ఫష్టం చేసింది. ఏపీలో హంద్రీ-నీవా ఎత్తిపోతల పథకం, తెలుగుగంగ ప్రాజెక్టు, గాలేరి-నగరి, వెలిగొండ ప్రాజెక్టులతో పాటు తెలంగాణలోని కల్వకుర్తి ఎత్తిపోతల, నెట్టంపాడ ఎత్తిపోతలకు అనుమతులు అవసరం లేదని స్పష్టం చేసింది. రాష్ట్ర పునర్విభజన చట్టాన్ని అనుసరించి అప్పటికే అనుమతులు పొంది నిర్మాణాలు కొనసాగుతున్న నేపథ్యంలో సాంకేతిక కారణాలతో అవి అనుమతుల్లేని ప్రాజెక్టుల జాబితాలో చేరాయి. ఈ నేపథ్యంలో ఏడాది లోపు డీపీఆర్‌ లు సమర్పించి అనుమతులు తీసుకోవాలనీ, లేదంటే నిర్వహణను నిలిపివేయాల్సి ఉంటు-ందంటూ కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కెఆర్‌ఎంబి) ప్రకటించింది. ఈ నేపథ్యంలో రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఆయా ప్రాజెక్టుల విషయంలో కేంద్రానికి సమగ్రమైన నివేదికలు అందించాయి. కొన్ని ప్రాజెక్టులను ఆయా రాష్ట్రాల్రకు కేటాయించిన కృష్ణా జలాల కేటాయింపులకు లోబడి నిల్వ నీటిపై ఆధారపడి నిర్మిస్తున్నందున ప్రత్యేకించి అనుమతులు అవసరం లేదు..

కొన్ని ప్రాజెక్టులయితే ఉమ్మడి రాష్ట్రంలో అనుమతులు ఉన్నాయి..పునర్విభజన చట్టం ప్రకారం వాటికి కొత్తగా అనుమతులు తీసుకోవాల్సిన అవసరం లేదు..ఈ దశలో కృష్ణా బోర్డు ఆదేశాలు ఆయా ప్రాజెక్టులకు వర్తించని వివరణ ఇస్తూ రెండు రాష్ట్రాల్రు కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖతో పాటు సీడబ్ల్యూసీకి నివేదికలు అందించాయి. ఈ నేపథ్యంలో కృష్ణా బోర్డు జారీ చేసిన సంబంధిత క్లాజుల నుంచి ఆరు ప్రాజెక్టులకు మినహాయిస్తూ వాటికి కొత్తగా అనుమతులు తీసుకోవాల్సిన అవసరం లేదని కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్‌ జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన తాజా ఉత్తర్వులు ప్రకారం ఏపీలోని వెలిగొండ ప్రాజెక్టు హెడ్‌రెగ్యులేటర్‌, టన్నెల్‌, అనుబంధ పనులు, నల్లమల సాగర్‌ పనులకూ, హంద్రీనీవా ఎత్తిపోతల పథకంలోని పంప్‌హౌస్‌, అనుబంధ పనులకూ, తెలుగు గంగ ప్రాజెక్టులోని టీజీసీ హెడ్‌ వర్క్స్‌కూ, గాలేరు-నగరిలోని హెడ్‌వర్క్స్‌, దాని అనుబంధ పనులకు అనుమతులు అవసరం లేదు. తెలంగాణలోని కల్వకుర్తి ఎత్తిపోతల పథకానికి సంబంధించిన పంప్‌హౌస్‌, అనుబంధపనులు, 15 టీఎంసీల అదనపు జలాల కోసం చేపడుతున్న పనులకూ, నెట్టంపాడు ఎత్తిపోతల పథకంలోని పంప్‌హౌస్‌, అనుబంధపనులకు ప్రత్యేకించి అనుమతులు తీసుకోవాల్సిన అవసరం లేదు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement