Friday, November 22, 2024

అర్ధరాత్రి 12 దాకా అనుమతి.. హోటళ్లు, రెస్టారెంట్లకు పండగే..

అమరావతి, ఆంధ్రప్రభ: రాష్ట్రంలో హోటళ్లు, రెస్టారెంట్‌లు అర్థరాత్రి 12 గంటల వరకూ నిర్వహించవచ్చని రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఆదేశాలు జారీ చేసింది. ఈమేరకు స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ అనంతరాము సోమవారం ఉత్తర్వులు ఇచ్చారు. ఉదయం 5 గంటల నుంచి అర్థరాత్రి 12 గంటల వరకు తెరిచి ఉంచుకునేందుకు అనుమతినిచ్చింది. కోవిడ్‌ కారణంగా గతంలో ప్రభుత్వం రాత్రి 10.30 గంటల వరకు మాత్రమే తెరిచి ఉంచాలని ఆంక్షలు విధించింది. కోవిడ్‌ పరిస్థితులు చక్కబడటంతో వ్యాపార వేళల్ని అర్థరాత్రి 12 గంటల వరకు పొడిగించాలని కోరుతూ హోటల్స్‌ అసోసియేషన్‌ ప్రభుత్వాన్ని కోరింది. దీనిపై ఆలోచన చేసిన ప్రభుత్వం రాష్ట్రంలో నడుస్తున్న బార్‌ అండ్‌ రెస్టారెంట్లు మినహా హోటళ్ళు, రెస్టారెంట్లు, తినుబండారాల బళ్ళు అర్థరాత్రి 12 గంటల వరకు నిర్వహించుకొనేందుకు అనుమతిచ్చింది. మంగళవారం నుంచి తాజా ఉత్తర్వులు అమల్లోకి రానున్నాయి. కోవిడ్‌ నిబంధనల ప్రకారం మాస్క్‌లు ధరించడంతో పాటు పరిశుభ్రత పాటించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 2020 మార్చిలో కోవిడ్‌ మహమ్మారి విజృంభించింది. పెద్ద సంఖ్యలో ప్రజలు వైరస్‌ భారిన పడటంతో పాటు కొందరు మృతి చెందారు.

ఒక్కసారిగా పరిస్థితులు అల్లకల్లోలంగా మారాయి. ఈక్రమంలో ప్రభుత్వం కోవిడ్‌ ఆంక్షల్ని కట్టుదిట్టం చేసింది. వైరస్‌ వ్యాప్తిని కట్టడి చేయడంలో భాగంగా కర్మాగారాలు, పరిశ్రమలు, దుకాణాలపై ఆంక్షలు విధించింది. రాత్రి 10 గంటల కల్లా హోటళ్ళు, రెస్టారెంట్లు మూసివేయాలని ప్రభుత్వం ఆదేశించింది. కరోనా మూడు వేవ్‌లు పూర్తయ్యాయి. రెండు విడతల్లో 96 శాతం మేర వ్యాక్సినేషన్‌ను వైద్య ఆరోగ్యశాఖ పూర్తి చేసింది. సాధారణ పరిస్థితులు నెలకొనడంతో హోటల్‌, రెస్టారెంట్ల వ్యాపారాలు క్రమేపీ పెరిగాయి. దీంతో అర్థరాత్రి వరకు అనుమతుల్ని పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, గుంటూరు వంటి నగరాల్లో రెస్టారెంట్లు, హోటళ్ళు కస్టమర్లతో మరింత కళకళలాడనున్నాయి..

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement