Wednesday, November 20, 2024

గుంటూరు యార్డులో మిర్చి జోరు.. భారీగా దిగుమతవుతున్న కొత్తకాయ

గుంటూరు, ప్రభన్యూస్‌ బ్యూరో: ఆసియా ఖండంలోనే అతిపెద్దదైన గుంటూరు మిర్చియార్డుకు సీజన్‌ మొదలైంది. సంక్రాంతి తర్వాత సరుకు భారీగా వస్తుందని ఊహించిన అధికారులకు పండుగకు ముందుగానే భారీగా సరుకు దిగుమతి అవుతోంది. గుంటూరు జిల్లాతోపాటు పల్నాడు, కర్నూలు, పశ్చిమగోదావరి, ప్రకాశం, కృష్ణా, రాయలసీమ, కర్ణాటకలోని బళ్లారి తదితర ప్రాంతాల నుంచి సరుకు వచ్చి చేరుతోంది. యార్డుకు నిత్యం 70 నుంచి 80వేల వరకు సరుకు వస్తోంది. కొత్త సంవత్సరం ఆరంభంలో మిర్చి ధరలకు శుభారంబం పలకడంతో రైతులు సంతోషంగా ఉన్నారు. మిర్చి ధరలు నిలకడగా కొనసాగుతుండడంతో యార్డుకు సరుకుతో వస్తున్న రైతులు క్యాష్‌తో వెళుతున్నారు. మిర్చి యార్డుకు రాయలసీమ ప్రాంతం నుంచి వస్తున్న మిర్చికి గిరాకి ఏర్పడింది. కోల్డ్‌ స్టోరేజీల్లో నిల్వ ఉంచిన మిర్చికి గత నెల వరకు మంచి ధరలు రాగా తాజాగా కోసి ఆరబెట్టిన మిర్చికి మాత్రమే యార్డులో మంచి ధరలు వస్తున్నాయి.

అంతేగాక వీటికి కర్ణాటక, కేరళ నుంచి ఆర్డర్లు లభిస్తుండడంతో బయ్యర్లు పోటీపడి కొనుగోలు చేస్తున్నారు. ఈ రెండు రాష్ట్రాలకు చెందిన పౌరసరఫరాలశాఖ ద్వారా దాదాపు 20 వేల టన్నుల వరకు ఆర్డర్లు లభించాయి. ప్రస్తుతం రోజుకు సగటున 70 వేల టిక్కీలు వరకు వస్తున్నాయి. అయితే ధరలు గత వారం కంటే ఈ వారం స్వల్ప హెచ్చు తగ్గుదలతో నిలకడగా ఉన్నాయి. యార్డుకు వస్తున్న సరుకులో నాన్‌ ఏసీ కామన్‌ వెరైటీ కనిష్ట ధర క్వింటాలు రూ.9 వేలు ఉండగా గరిష్ట ధర రూ.28 వేలుగా వచ్చిందని అధికారులు తెలిపారు.

కొన్ని వెరైటీలకు డిమాండ్‌

- Advertisement -

కొన్ని వెరైటీలు క్వింటాలు రూ.30 వేల నుంచి 40 వేల వరకు లభించాయని రైతులు చెబుతున్నారు. గత వారం కంటే ఈ వారం మొత్తం అన్ని రకాలకు క్వింటాల్‌కు వెయ్యి నుంచి రూ.2 వేల వరకు పెరిగాయి. తేజ, బాడిగ, కొత్తవి 2043 రకం ధరలు భారీగా పెరుగుతున్నాయి. 2043 రకం కొంత సరుకు గరిష్టంగా రూ.40 వేల వరకు పలికింది. మిర్చియార్డుకు వచ్చే సరకు రోజురోజుకూ పెరుగుతోంది. సంక్రాంతి పండగ తర్వాత 80,000 పైగా బస్తాలు వస్తాయని వ్యాపారులు, అధికారులు అంచనా వేశారు. వారి అంచనాలు తలకిందులు చేస్తూ గత వారంలోనే అంతకు మించిన సరకు వస్తే.. మంగళవారం ఏకంగా 70వేల బస్తాలు యార్డుకు వచ్చాయి. అనధికారికంగా బిడ్డింగ్‌ తర్వాత ఇంకా 25,000 బస్తాలు వరకు వచ్చాయని అధికారులు పేర్కొంటున్నారు. వచ్చే ఆదివారం సంక్రాంతి పండగ కావడంతో పండగకు ఖర్చులు ఉంటాయని, నూతన వస్త్రాలు కొనుగోలు చేసుకునేందుకు ఇతరత్రా అవసరాలకు కూడా అమ్మకం నిమిత్తం సరకు యార్డుకు తీసుకువస్తున్నారని పేర్కొంటున్నారు.

పల్నాడు, ప్రకాశం జిల్లాల నుంచి రైతులు అధికంగా మిర్చిని యార్డుకు తరలించారు. ఈ-నామ్‌ ద్వారా 58,741 బస్తాలు విక్రయాలు జరిగాయి. అమ్మకాలు ముగిసే సమయానికి యార్డులో 24,426 బస్తాలు నిల్వ ఉన్నాయి. సరకు అధికంగా వచ్చినప్పటికీ ధరలు పెద్దగా తగ్గలేదు. కొన్ని రకాల ధరలు స్వల్పంగా పెరిగాయి. మొదటి కోత కావడంతో యార్డుకు వచ్చే మిర్చిలో నాణ్యత ఉండటం లేదు. నాన్‌ ఏసీ కామన్‌ వెరైటీ 334, నెంబర్‌ 5, 273, 341, 4884, సూపర్‌ 10 రకాల మిర్చి సగటు ధర రూ.9,000 నుంచి రూ.26,000 ఉండగా, నాన్‌ ఏసీ స్పెషల్‌ వెరైటీ తేజ రకం మిర్చికి రూ.8,000 నుంచి రూ.25,000, బాడిగ రూ.10,000 నుంచి రూ.28,000, దేవనూరు డీలక్కు రూ.12,000 నుంచి రూ.25,000, తాలు మిర్చికి రూ.4,000 నుంచి రూ.14,000 ధర లభించింది. ఏసీ కామన్‌ వెరైటీ 334, 341, సూపర్‌ 10 రకాల మిర్చి సగటు ధర రూ.10,000 నుంచి రూ.27,000, ఏసీ స్పెషల్‌ వెరైటీ తేజ రకం రూ.8,800 నుంచి రూ.22,000, బాడిగ రూ. 20,200 నుంచి రూ.22,000, తాలు మిర్చికి రూ.4,100 నుంచి రూ.12,500 ధర లభించింది. సంక్రాంతి తరువాత గుంటూరు, పల్నాడు, ప్రకాశం, ఎన్‌టిఆర్‌ జిల్లాల్లో తొలి విడత కోతలకు సంబంధించిన మిర్చి ఒకేసారి భారీ వస్తుందని భావిస్తున్నట్టు యార్డు కార్యదర్శి వెంకటేశ్వరరెడ్డి తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement