(ఆంధ్రప్రభ, ఎన్టీఆర్ బ్యూరో) : ఎన్నికల్లో స్వప్రయోజనం కోసం ఎడాపెడా హామీలు ఇచ్చిన కూటమి ప్రభుత్వంపై విసుగుచెందిన రాష్ట్ర ప్రజలందరూ జగన్ పరిపాలన కోసం ఎదురుచూస్తున్నారని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పిఎసి మెంబర్, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, ప్రణాళికా సంఘం మాజీ ఉపాధ్యక్షుడు మల్లాది విష్ణు, జిల్లా పార్టీ అధ్యక్షుడు దేవినేని అవినాష్ పేర్కొన్నారు. చరిత్రలో ఎవరు చెయ్యని విధంగా సుపరిపాలన అందించిన ఘనత కేవలం జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు. జగన్ లేని రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమం కుంటుపడిందన్నారు. మాజీ సీఎం, వైసీపీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు నగరంలో అటహాసంగా నిర్వహించారు. నగరంలోని కంట్రోల్ రూమ్ వద్ద ఉన్న వైఎస్సార్ విగ్రహం వద్ద శనివారం నిర్వహించిన పుట్టినరోజు వేడుకల్లో భాగంగా వైఎస్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం 52కేజీల కేక్ ను కట్ చేసి పంచిపెట్టారు.అలాగే దేవినేని అవినాష్ ఆధ్వర్యంలో మహిళలకు చీరలను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా దేవినేని అవినాష్ మాట్లాడుతూ… అనేక సేవా, అభివృద్ధి కార్యక్రమాలు చేసి జగన్ ప్రజల అభిమానం చూరగొన్నారని తెలిపారు. జగన్ ఐదు సంవత్సరాల పాలనలో ఆన్ని వర్గాల ప్రజలు ఆనందంగా ఉన్నారని, జగన్ లేకపోతే రాష్ట్రం ఎలా ఉంటుందో ఇప్పుడు ప్రజలు చూశారన్నారు. ఏ సంక్షేమ పథకం లేదని,ప్రజల కష్టాలు పట్టించుకునే వారే లేరన్నారు. రైతులను మోసం చేసే దిశగా కూటమి ప్రభుత్వం ప్రవర్తిస్తుందని, రాబోయే రోజుల్లో ప్రజల దీవెనలు, దేవుడు ఆశీస్సులతో మళ్ళీ అధికారంలోకి వస్తామన్నారు.
వెల్లంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ…. ప్రతి ఇంటి పెద్ద కొడుకు అయిన జగన్ జన్మదిన వేడుకలను రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా చేశారన్నారు. ప్రతి ఒక్కరకి తోడు ఉంటు అనేక మంచి కార్యక్రమాలు చేసారని, ఆరు నెలల కూటమి పాలన అధ్వాన్నంగా ఉందన్నారు. ఏ హామీ అమలు చేయకుండా బాధుడే బాధుడు అన్నట్లు పాలన సాగిందన్నారు. విద్యుత్ చార్జీల మోత, ఫ్రీ బస్సు లేదని, గ్యాస్ పేరుతో మోసం చేసినట్లు గుర్తు చేశారు. జగన్ పేరు చెబితేనే కూటమి నేతలు బయపడుతున్నారన్నారు. ప్రజలకు న్యాయం చేయమంటే వైసీపీ నేతలపై కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారని ఆరోపించారు. ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ రూహుల్లా, పిఎసిఎస్ మెంబర్ షేక్ ఆసిఫ్ తో పాటు ఇతర నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.