Tuesday, November 26, 2024

నిప్పులు చెరుగుతున్న భానుడు.. ఎండల తీవ్రత, వడగాల్పులతో అల్లాడిపోతున్న ప్రజలు

అమరావతి, ఆంధ్రప్రభ: ప్రచండభానుడి ప్రతాపాగ్నికి జనం అల్లాడిపోతున్నారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మంగళవారం సూరీడు సుర్రుమనిపించాడు. కర్నూలు, నంధ్యాల ప్రాంతాల్లో 42 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అనకాపల్లి 5, కాకినాడ 3 మండలాల్లో తీవ్ర వడగాల్పులు వీచాయి. అల్లూరి 3, అనకాపల్లి 7,ఏలూరు 4, కాకినాడ 3, కృష్ణా 2, ఎన్టీఆర్‌, పల్నాడు, విశాఖ, విజయనగరం లో ఒక్కొక్క మండలంలో వడగాల్పులు నమోదయ్యాయి. మండుతున్న ఎండలకు వడగాలులు తోడవ్వడంతో ప్రజలు బయటకు రావాలంటేనే భయపడిపోతున్నారు.

ఐఎండి అంచనాల ప్రకారం బుధవారం 4 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 126 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉంది. అల్లూరి జిల్లా కూనవరం మండలం, కాకినాడ జిల్లా కోటనందూరు, అనకాపల్లి జిల్లా గొలుగొండ, నాతవరం, మండలాల్లో తీవ్రవడగాల్పులు ప్రభావం చూపే అవకాశం ఉంది. ఈ ప్రాంతాల్లో 42 నుంచి 46 డిగ్రీల వరకు అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని విపత్తు నిర్వహణా సంస్థ సూచించింది.

అల్లూరి జిల్లా 9, అనకాపల్లి 14, తూర్పు గోదావరి 16, ఏలూరు 5, గుంటూరు 6, కాకినాడ 12, కోనసీమ 1, కృష్ణా 6, ఎన్టీఆర్‌ 14, పల్నాడు 1, మన్యం 11, శ్రీకాకుళం 7, విశాఖ 3, విజయనగరం 18, వైయస్సార్‌ 3 మండలాల్లో వడగాల్పులు ప్రభావం చూపే అవకాశం ఉందని విపత్తు నిర్వహణా సంస్థ ఎండీ డా.బీఆర్‌ అంబేద్కర్‌ తెలిపారు. ఎండల తీవ్రత, వడగాలుల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అత్యవసరం అయితేనే ఎండవేళల్లో బయటకు వెళ్ళాలని, ఎండ నుంచి తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement