ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాలు మరింత హీట్‌గా కనిపిస్తున్నాయి. ఇప్పటికే రాజకీయ పార్టీలన్నీ ఎన్నికలకు సమరశంఖాన్ని పూరించాయి. జోరుగా ప్రచారంలో పాల్గొంటున్నాయి. ఎలాగైనా వైసీపీ సర్కార్‌ను గద్దె దించాలన్న లక్ష్యంతో టీడీపీ, జనసేన కలిసి పనిచేస్తున్నాయి. తాజాగా తమ పొత్తులో బీజేపీని కూడా కలుపుకొన్నాయి. ఇక సీట్ల పంపకాలపై ఫోకస్ పెట్టాయి.అయితే.. తాజాగా మేదరమెట్ల వైసీపీ ‘సిద్ధం’ సభపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తీవ్ర విమర్శలు చేశారు. సీఎం జగన్ సిద్దం సభకు జనాలే రాలేదని ఎద్దేవా చేశారు. స్క్రీన్‌పై జనాలు భారీ ఎత్తున వచ్చారంటూ చూపించినదంతా గ్రాఫిక్స్ అంటూ కొట్టి పారేశారు. ఈ మేరకు నారా లోకేశ్ సీఎం జగన్ సిద్ధం సభలో గ్రాఫిక్స్ చేశారంటూ కొన్ని ఫొటోలను కూడా షేర్ చేశారు.
ఈ మేరకు ఎక్స్‌లో పోస్టు పెట్టిన నారా లోకేశ్.. ఒక గుంపు జనాన్ని పలు చోట్ల అమర్చారంటూ కొన్ని ఫొటోలను రిలీజ్ చేశారు. ఏకంగా మార్ఫింగ్ ఫొటోలు వేసిన వైనం చరిత్రలో ఎప్పుడైనా చూశారా అంటూ నారా లోకేశ్ ప్రశ్నించారు. డ్రోన్ చిత్రాలు, గ్రీన్ మ్యాట్‌తో సీఎం జగన్.. వైసీపీ నాయకులు దొరికిపోయారన్నారు. ఇప్పుడు ఏకంగా మార్ఫింగ్ చేసి ఫొటోలు వదిలారని విమర్శించారు. సీఎం జగన్ పాలనపై ఏపీ ప్రజలంతా విసిగిపోయారని అన్నారు. వైసీపీకి ప్రజలు ఈ ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్తారని అన్నారు. సీఎం జగన్ అధికారం నిలబెట్టుకునేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రజలు చిత్తుగా ఓడించడం ఖాయమంటూ నారా లోకేష్ చెప్పారు.