Friday, November 22, 2024

Pension Day – గుండుమ‌ల‌లో ల‌బ్దిదారుల‌కు చంద్ర‌బాబు పించ‌న్లు పంపిణీ…

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్ – మ‌డ‌క‌శిర – ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఉమ్మడి అనంతపురం జిల్లా మడకశిర మండలం గుండుమల గ్రామానికి వెళ్లారు. అక్కడ ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీ ప్రక్రియలో స్వయంగా పాల్గొన్నారు. గ్రామంలో పలువురు లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి తన చేతుల మీదుగా పెన్షన్ అందించారు. వారితో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. వితంతు మ‌హిళ ఓబులమ్మ ఇంటికి వెళ్లిన చంద్రబాబు ఆమెకు పెన్షన్ అందజేశారు. తన ఇల్లు సరిగా లేదని ఓబులమ్మ చెప్పడంతో చంద్రబాబు వెంటనే స్పందించారు. శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ ను పిలిచి, ఇల్లు బాగు చేసి ఇవ్వాలని ఆదేశించారు.

తొలి రోజే 96 శాతం పించ‌న్లు పంపిణీ.

ఏపీ వ్యాప్తంగా ఎన్టీఆర్‌ భరోసా పింఛన్ల పంపిణీ దాదాపు పూర్తయ్యింది. రాష్ట్ర వ్యాప్తంగా 96శాతం పింఛన్లు పంపిణీ పూర్తి చేశారు. ఒక్క రోజులోనే పింఛన్లు పంపిణీ పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. గ్రామ, వార్డు సచివాలయాల కార్యదర్శుల ద్వారా ప్రభుత్వం ఈ కార్యక్రమం చేపట్టింది. సత్యసాయి జిల్లా మండకశిర మండలం గుండుమలలో సీఎం చంద్రబాబు లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి స్వయంగా పింఛను డబ్బులు అందజేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆయా నియోజకవర్గాల్లోని ప్రజాప్రతినిధులు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. సాయంత్రం 4గంటల సమయానికి 96శాతం పింఛన్లు పంపిణీ చేసినట్టు అధికారులు వెల్లడించారు. మిగిలిన నాలుగుశాతం పెన్షన్లు పంపిణీ చేసేలా సచివాలయ ఉద్యోగులు ప్రయత్నిస్తున్నారు. అత్యధికంగా కృష్ణా జిల్లా, అత్యల్పంగా అల్లూరి జిల్లాలో పెన్షన్ల పంపిణీ జరిగింది.

- Advertisement -

జ‌గ‌న్ పాల‌న‌లో అన్ని వ్య‌వ‌స్థ‌లు నాశ‌నం

వైసిపి ప్రభుత్వం అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేసిందని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మండిపడ్డారు. అవినీతి, విధ్వంసం, అసమర్థ పాలనతో రాష్ట్రాన్ని నిర్వీర్యం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీసత్యసాయి జిల్లా మడకశిర మండలం గుండుమలలో నిర్వహించిన ప్రజావేదికలో పింఛను లబ్ధిదారులతో సీఎం ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ప్రజల ఆస్తులకు రక్షణగా ఉండాల్సిన వారే వైకాపా పాలనలో ఇష్టానుసారం దోపిడీ చేశారని విమర్శించారు. సర్వే రాళ్ల కోసం రూ.700 కోట్లు ఖర్చు చేసి వాటిపై కూడా ఫొటోలు వేయించుకున్నారని విమర్శించారు.

”ఐదేళ్లలో పేదలకు ఇళ్లు కట్టలేదు కానీ, రుషికొండలో ప్యాలెస్‌ కట్టారు. మేం పాలకులం కాదు.. సేవకులమని గుర్తించాలి. వాస్తవాలు తెలియాలని 7 శ్వేతపత్రాలు విడుదల చేశాం. ప్రజల ఆదాయం పెంచే కార్యక్రమాలు చేపడుతున్నాం. రాళ్ల సీమను రతనాల సీమగా చేసే బాధ్యత మాది. పట్టు పరిశ్రమతో మంచి ఆదాయం.. ఉపాధి కల్పన. తెదేపా హయాంలో సాగునీటికి రూ.68వేల కోట్లు ఖర్చు చేశాం. కరవు జిల్లాలో కియా మోటార్స్‌ తీసుకొచ్చాం. పోలవరం పూర్తి చేసి నదులు అనుసంధానిస్తే కరవు ఉండదు. అనంతపురం జిల్లాను సస్యశ్యామలం చేస్తాం. పంటలకు గిట్టుబాటు ధరకు చర్యలు తీసుకుంటాం. జిల్లాలో డ్రిప్‌ ఇరిగేషన్‌ అందుబాటులోకి తెస్తాం. మడకశిరలో రూ.60 కోట్లతో రింగ్‌రోడ్డు నిర్మిస్తాం. ఈ ప్రాంతంలో రెండు రిజర్వాయర్లు నిర్మిస్తాం. పరిశ్రమలు తెచ్చి ఉపాధి కల్పిస్తాం.పేదలందరికీ ఇళ్లు కట్టించే బాధ్యత తీసుకుంటాం. ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ.4లక్షల ఆర్థిక సాయం చేస్తాం” అని చంద్రబాబు హామీ ఇచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement