నెల్లూరు, (ప్రభన్యూస్): పెన్నమ్మ పరవళ్లతో నెల్లూరు జిల్లా జీవనాడి సోమశిల జలాశయం నిండుకుండలా తొణికిసలాడుతుంది. కొంత కాలంగా సోమశిలకు వరద పోటెత్తుతోంది. జలాశయం పూర్తి సామర్థం 78 టీ-ఎంసీలు కాగా, భద్రత దృష్ట్యా ప్రస్తుతం వరద కొనసాగుతున్న నేపథ్యంలో 72 నుంచి 73 టీ-ఎంసీలను నిల్వ చేసి ఇక వచ్చిన వరద వచ్చినట్లు-గా దిగువకు నాలుగు క్రస్ట్ గేట్లు-ఎత్తి వదులుతున్నారు. సోమశిల జలాశయంకు ఈసారి ముందుగానే వరద రాక కొనసాగగా కండలేరు జలాశయంకు కూడా సమృద్ధిగా నీరు నింపడం జరిగింది.
ప్రకాశం జిల్లా రాళ్లపాడు రిజర్వాయరు ఉత్తర కాలువ ద్వారా 500 క్యూసెక్కుల నీరు రోజువారిగా సరఫరా చేస్తున్నారు. అదేవిధంగా దక్షిణ కాలువ పరిధిలో మొదటి పంటకు నీరు కొంత కాలంగా వదులుతున్నారు. రాయలసీమ జిల్లాలో ఈ ఏడాది మందుగానే సమృద్ధిగా వర్షాలు కురవడం తద్వారా సోమశిల, కండలేరు జలాశయాలతో పాటు-జిల్లాలోని చెరువులకు నీటి లభ్యత చేకూరడంతో జిల్లా రైతంగంలో హర్షం నెలకొంది. నీటి కొరత లేని కారణంగా ఈసారి మొదటి పంట కింద జిల్లా వ్యాప్తంగా సుమారు 7 నుంచి 9 లక్షల ఎకరాలు వరి పండే సూచనలు కనిపిస్తున్నాయి. చివరి ఆయకట్టు-వరకు నీటి సమస్యలు ఉత్పన్నం కాకుండా చర్యలు చేపట్టామని అదికారులు చెబుతున్నారు.
సోమశిల జలాశయంకు వరద కొనసాగుతుండగా సోమవారం నాటికి 99.708 మీటర్లతో 71.641 టీ-ఎంసీల నీరు జలాశయంలో నిల్వ ఉన్నట్లు- అధికారులు తెలిపారు. ఎగువ ప్రాంతాల నుంచి 17,641 క్యూసెక్కుల ఇన్‌ప్లో వస్తుండగా దిగువకు నాలుగు గేట్లు-ద్వారా 19,550 క్యూసెక్కులు సరఫరా చేస్తున్నారు.