ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన పలువురు ఐఏఎస్ ఆఫీసర్లు ఇవ్వాల హైకోర్టుకు హాజరయ్యారు. ఉపాధి హామీ పథకం బిల్లులకు సంబంధించి కోర్టు ధిక్కరణ కేసు ఎదుర్కొంటున్న నలుగురు ఐఏఎస్ అధికారులు గోపాలకృష్ణ ద్వివేది, రావత్, కోన శశిధర్, వివేక్ యాదవ్ ఇవ్వాల (శుక్రవారం) న్యాయస్థానంలో విచారణకు హాజరయ్యారు. ఏడాది క్రితం బిల్లుల చెల్లింపు ఆదేశాలను పట్టించుకోలేదని వీరిపై కోర్టు ధిక్కరణ కేసు నమోదైంది.
కాగా, ఇవ్వాల జరిగిన విచారణ సందర్భంగా పిటిషనర్ల తరఫున న్యాయవాది నర్రా శ్రీనివాస్ వాదనలు వినిపించారు. న్యాయస్థానం ఇచ్చిన తీర్పుపై ఎందుకు ఆలస్యం చేస్తున్నారని హైకోర్టు ధర్మాసనం ఐఏఎస్ అధికారులను ప్రశ్నించింది. పిటిషనర్లకు వ్యయం పెరుగుతోందని వెల్లడించింది. ఇవ్వాల విచారణ ఉందని తెలిసి, బిల్లుల చెల్లింపులను రెండ్రోజుల కిందట ఖాతాలో వేశారని హైకోర్టు ఆక్షేపించింది. ఏడాది జాప్యంపై సరైన వివరణ ఇవ్వాలని నలుగురు అధికారులను ఆదేశించింది. అనంతరం, తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా కోర్టు వేసింది.