ఉమ్మడి గుంటూరు బ్యూరో, ఆంధ్రప్రభ : సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాల్లో కొనుగోళ్ళు పూర్తిస్థాయిలో ప్రారంభం కాకపోవడంపై గ్రామీణ అభివృద్ధి, కమ్యూనికేషన్ శాఖ కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ అసహనం వ్యక్తం చేశారు. ఆలస్యానికి గల కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.
అనంతరం స్థానికంగా నెలకొన్న సమస్యలపై రైతులతో కూడా ఆయన ఫోన్ ద్వారా మాట్లాడారు. కాగా పత్తి కొనుగోల్లపై గుంటూరు సిసిఐ జనరల్ మేనేజర్ నిరాసక్తత ప్రదర్శిస్తున్నారని, తమను ఉద్దేశపూర్వకంగా ఇబ్బంది పెడుతున్నారని రైతులు ఈ సందర్భంగా పెమ్మసాని దృష్టికి తీసుకువెళ్లారు.
కాగా సంబంధిత సమస్యపై అధికారులతో చర్చించిన అనంతరం సిసిఐ జీఎం నిర్లక్ష్య ధోరణి అడుగడుగునా ప్రస్ఫుటమవడంతో కేంద్ర జోవుళీ శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ , సీసీఐ సీఎండీ గుప్తా దృష్టికి ఈ సమస్యను పెమ్మసాని తీసుకువెళ్లారు. జిఎం వ్యవహార తీరుపై ఫిర్యాదు చేశారు.
కేంద్ర ప్రభుత్వం స్పందిస్తూ సిసిఐ సీనియర్ అధికారిని రంగాల్లోకి దింపింది. పత్తి కొనుగోళ్లకు ప్రత్యేక పర్యవేక్షణ చేపట్టాలని ఆదేశాలు జారీ చేసింది. కాగా పత్తి కొనుగోళ్ళను పూర్తిస్థాయిలో ప్రారంభించాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేయగా, రైతులకు పూర్తిస్థాయిలో కొనుగోలు ప్రారంభిస్తామని కూడా భరోసా ఇచ్చింది.