ఏపీలో కొద్ది రోజుల క్రితం పెగాసస్ స్పై వేర్ వ్యవహారం తీవ్ర కలకలం రేపింది. టీడీపీ ప్రభుత్వం చంద్రబాబు హయాంలో పెగాసెస్ స్పైవేర్ కొనుగోలు చేశారని పశ్చిమ్‌బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కామెంట్ చేశారనే వార్తల నేపథ్యంలో ఏపీ రాజకీయాల్లో వివాదం చెలరేగింది. దీనిపై ప్రస్తుతం అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం.. టీడీపీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించింది. ఏపీ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా టీడీపీ హయాంలో రాజకీయ ప్రత్యర్థులపై స్పైవేర్‌ను ఎలా ఉపయోగించిందనే దానిపై సమగ్ర విచారణ జరిపేందుకు హౌస్ కమిటీని ఏర్పాటు చేయాలని వైసీపీ కోరింది. ఈ నేపథ్యంలోనే పెగాసస్ వివాదంపై సమగ్ర విచారణకు హౌస్ కమిటీని ఏర్పాటు చేయాలని శాసనసభ ఏకగ్రీవంగా నిర్ణయించినట్లు స్పీకర్ తమ్మినేని సీతారాం మార్చి 21న అసెంబ్లీలో ప్రకటించారు.
అయితే.. తాజాగా ఈ వ్యవహారానికి సంబంధించి ఏపీ సర్కార్ దూకుడు పెంచింది. పెగాసస్ అంశంలో ఏర్పాటైన హౌస్ కమిటీ ఇవ్వాల తొలిసారిగా భేటీ అయ్యింది. ఎమ్మెల్యే భూమన కరుణారెడ్డి అధ్యక్షతన హౌస్ కమిటీ భేటీ జరుగుతోంది. ప్రాథమికంగా జరిగిన ఈ సమావేశంలో ఏ విధంగా ముందుకెళ్లాలనే అంశాలను చర్చించినట్టుగా తెలుస్తోంది.
కాగా, ఈ అసెంబ్లీ హౌస్ కమిటీ రేపు హోం శాఖ, ఐటీ శాఖల అధికారులతో కూడా భేటీ కానున్నట్టు తెలుస్తోంది. అయితే.. హౌస్ కమిటీ ఏర్పాటు తర్వాత దాదాపు 3 నెలల తర్వాత తొలిసార భేటీ కావడంతో ఈ వ్యవహారంలో ఏపీ సర్కార్ దూకుడుగా వ్యవహరించే అవకాశమే ఉందనే టాక్ వినిపిస్తోంది.
మరోవైపు పెగాసెస్ స్పైవేర్ కొనుగోలు ఆరోపణలను తెలుగుదేశం పార్టీ ఖండించింది. చంద్రబాబు హయాంలో ఇంటెలిజెన్స్ చీఫ్‌గా ఉన్న ఏబీ వెంకటేశ్వరరావు.. 2019 మే వరకు పెగాసస్ స్పైవేర్‌ను ప్రభుత్వం ఎప్పుడూ కొనుగోలు చేయలేదని స్పష్టం చేశారు. అయితే 2019 మే తర్వాత ఏం జరిగిందో తనకు తెలియదన్నారు ఏబీ వెంకటేశ్వరరావు.