తాడేపల్లి: వైసిపి ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు చంద్రబాబు కుట్రలో భాగమేనని విద్యుత్, అటవీ, భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. కాల్ రికార్డింగ్‌ను.. ఫోన్ ట్యాపింగ్ అంటూ కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి ప్రభుత్వంపై, వైయస్‌ఆర్ సీపీపై ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇలాంటి ఆరోపణలు చేయడం సమంజసం కాదన్నారు .
తాడేపల్లిలొ. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ కుట్రలు, కుతంత్రాలకు సీఎం వైయస్ జగన్ భయపడరన్నారు. ఇష్టం లేనివారు తెలుగుదేశం పార్టీకి వెళ్లాలనుకుంటే వెళ్లొచ్చు కానీ, ప్రభుత్వంపై, వైయస్‌ఆర్ సీపీపై బురదజల్లాలనుకోవడం మంచిపద్ధతి కాదన్నారు. వైయస్ జగన్ పార్టీ స్థాపించకపోతే ఇలాంటివారంతా ఎమ్మెల్యేలు అయ్యేవారా..? అని కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిని ఉద్దేశించి మంత్రి పెద్దిరెడ్డి ప్రశ్నించారు. చంద్రబాబు కుట్రలో భాగమే ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలని, ఇలాంటి వారికి సీఎం వైయస్ జగన్ భయపడేవారు కాదన్నారు. తెలుగుదేశం పార్టీలో చేరే ఎమ్మెల్యేలు బావిలో దూకినట్టేనని, అలాంటి వారు వెళ్లినా వైయస్‌ఆర్ సీపీకి వచ్చే నష్టమేమీ లేదన్నారు. లోకేష్ పాదయాత్ర టీడీపీకి గుదిబండగా మారుతుంది.