Tuesday, November 26, 2024

మున్సిప‌ల్, న‌గ‌ర పాల‌క సంస్థ‌ల‌లోనూ వైసిపిదే విజ‌యంః మంత్రి పెద్దిరెడ్డి ధీమా..

అమ‌రావ‌తి: సర్పంచ్‌ ఎన్నికల్లో ప్రజలంతా వైయస్‌ఆర్‌ సీపీ మద్దతుదారులకు బ్రహ్మరథం పట్టారని, త్వరలో జరగబోయే మున్సిపల్‌ ఎన్నికల్లో వైయస్‌ఆర్‌ సీపీ విజయం సాధిస్తుందని పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. మున్సిపల్‌ ఎన్నికల నేపథ్యంలో తాడేపల్లిలోని వైయస్‌ఆర్‌ సీపీ కేంద్ర కార్యాలయంలో కృష్ణా, గుంటూరు జిల్లాల మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలతో మంత్రి పెద్దిరెడ్డి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మున్సిపల్‌ ఎన్నికలపై విస్తృతంగా చర్చించారు. ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం తీసుకోవాల్సిన వ్యూహాలపై మంత్రి పెద్దిరెడ్డి దిశా నిర్దేశం చేశారు.
భేటీ అనంతరం మంత్రి పెద్దిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. సర్పంచ్‌ ఎన్నికల్లో అమరావతి చుట్టుపక్కల ప్రాంతంలో కూడా వైయస్‌ఆర్‌ సీపీ మద్దతుదారులు విజయం సాధించారన్నారు. మున్సిపల్‌ ఎన్నికల్లో వైయస్‌ఆర్‌ సీపీ అభ్యర్థులు విజయం సాధిస్తారని గట్టి నమ్మకం ఉందన్నారు. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి పరిపాలనను ప్రతిబింబించే విధంగా మున్సిపాలిటీలు, మున్సిపల్‌ కార్పొరేషన్లు గెలుస్తామని విశ్వాసం ఉందన్నారు. కృష్ణా జిల్లాలో గుడివాడ, జగ్గయ్యపేట మున్సిపాలిటీల్లో ఎన్నికలు జరగడం లేదని, ఎన్నికలు జరిగే మిగతా అన్ని చోట్ల వైయస్‌ఆర్‌ సీపీ విజయం సాధిస్తుందన్నారు. కాగా, ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ ప్రజల గుండెల్లో నిలిచిపోయారు కాబట్టే పంచాయతీ ఎన్నికల్లో వైయస్‌ఆర్‌సీపీ అభిమానులు గెలిచారని పెద్దిరెడ్డి పేర్కొన్నారు. ఇది వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి విజయంగానే తామంతా భావిస్తున్నామని స్పష్టం చేశారు. సీఎం వైయస్‌ జగన్‌పై ప్రజల్లో నమ్మకం మరింత నమ్మకం పెరిగిందని పేర్కొన్నారు. ప్రజాస్వమ్యానికి అద్దంపట్టేలా పంచాయతీ ఎన్నికల ఫలితాలు వచ్చాయని సంతృప్తి వ్యక్తం చేశారు. ఎన్నికలు సజావుగా జరిగి ఉంటే వైయస్‌ఆర్‌సీపీకి 90 శాతం పంచాయతీలు దక్కేవని చెప్పారు. చంద్రబాబు కుట్రలు, కుతంత్రాలు చేసి పంచాయతీ ఎన్నికల్లో గెలవాలని ప్రయత్నించారని, అవేవి కూడా రాష్ట్రంలో సాగలేదన్నారు. అంత‌కు ముందు పెద్దిరెడ్డి ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సంద‌ర్భంగా పంచాయతీ ఎన్నికల్లో చిత్తూరు జిల్లాలో అత్యధిక స్థానాల్లో వైయస్‌ఆర్‌ సీపీ మద్దతుదారుల విజయానికి కృషి చేసినందుకు మంత్రి పెద్దిరెడ్డికి ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ అభినందనలు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement