ఎన్టీఆర్ బ్యూరో, (ప్రభ న్యూస్) : గడిచిన కొన్ని రోజులుగా నీటి ప్రవాహం క్రమంగా పెరుగుతూ ఉగ్రరూపం దాల్చిన కృష్ణమ్మ ఇవ్వాల (శనివారం) రాత్రి వరకు శాంతించింది. కృష్ణానది ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాలకు పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో బ్యారేజీ గేట్లను ఎత్తి మిగులు జలాలను సముద్రంలోకి పంపుతున్నారు. గరిష్ట నీటి ప్రవాహం 2.70 లక్షల క్యూసుక్కుల నుండి ప్రస్తుతం 96 వేల క్యూసెక్కులకు తగ్గుముఖం పట్టింది. శనివారం రాత్రి 9 గంటల సమయానికి ప్రకాశం బ్యారేజీ వద్ద ఇన్ఫ్లో 96 వేల క్యూసెక్కులు కాగా, అవుట్ ఫ్లో కూడా 96 వేల క్యూసెక్కులుగా ఉంది.
బ్యారేజీ గరిష్ట నీటిమట్టం 3.07 టీఎంసీలు కాగా ప్రస్తుతం 70 గేట్లలో 65 గేట్లను రెండు అడుగుల మేర, 5 గేట్లను ఒక్క అడుగుమేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. బ్యారేజీ నుండి అన్ని గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్న నేపథ్యంలో సందర్శికులు తాకిడి పెరిగింది. శనివారం సెలవు దినం కావడంతో బ్యారేజీని సందర్శించే వారి సంఖ్య విపరీతంగా పెరిగింది. నీటి ప్రవాహాన్ని తిలకించడంతోపాటు ఫొటోలు తీసుకునేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఈ క్రమంలో బ్యారేజీపై ట్రాఫిక్ నిలిచిపోయింది.