Friday, November 22, 2024

AP: ప్రశాంతంగా ఇంటర్ పరీక్షలు.. మొదటి రోజు 722 మంది డుమ్మా..


(ప్రభ న్యూస్ ఎన్టీఆర్ బ్యూరో) : ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా ఇంటర్మీడియట్ పరీక్షలు శుక్రవారం నుండి ప్రారంభమయ్యాయి. మొదటిరోజు పరీక్షల్లో భాగంగా ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సర విద్యార్థులకు లాంగ్వేజ్ పేపర్ వన్ పరీక్షను నిర్వహించారు. జిల్లాల పునర్విభజన తర్వాత మొట్టమొదటిసారిగా ఎన్టీఆర్ జిల్లా కేంద్రంగా ఈ ఏడాది ఇంటర్మీడియట్ బోర్డు పరీక్షలను నిర్వహించింది. ఉదయం 9 గంటలకు ప్రారంభమైన ఈ పరీక్ష మధ్యాహ్నం 12గంటల వరకు కొనసాగింది. ఉదయం నుండే విద్యార్థులు వారికి కేటాయించిన పరీక్ష కేంద్రాలకు చేరుకుని త్వరగానే పరీక్ష గదుల్లోకి వెళ్లారు. జిల్లావ్యాప్తంగా 39,544 మంది మొదటి సంవత్సర విద్యార్థిల కోసం అధికారులు 99 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయగా, శుక్రవారం నిర్వహించిన ప్రథమ సంవత్సర పరీక్షకు 38, 822 మంది విద్యార్థులు హాజరయ్యారు.

722 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు ఎన్టీఆర్ జిల్లా ఇంటర్మీడియట్ అధికారి సి ఎస్ ఎస్ ఎన్ రెడ్డి తెలిపారు. జిల్లాలో పరీక్షలను పూర్తి నిఘా నీడలో పగడ్బందీగా నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. పరీక్షల కోసం మూడు ఫ్లయింగ్, ఐదు సిట్టింగ్ స్క్వాడ్ బృందాలను కూడా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పరీక్షా కేంద్రాల నుండి ప్రశ్నాపత్రాలను దగ్గరలో ఏర్పాటు చేసిన పోలీస్ స్టేషన్ నుండి తరలించినట్లు తెలిపారు. ఇందుకోసం 29 మంది కస్టోడియలను సైతం ఏర్పాటు చేశామన్నారు. అలాగే 1300 మంది ఇన్విజిలేటర్లను ఈ పరీక్షల కోసం తీసుకున్నట్లు తెలిపారు. జిల్లావ్యాప్తంగా శుక్రవారం నిర్వహించిన పరీక్ష ప్రశాంత వాతావరణంలో విద్యార్థులు రాసినట్లు ఆయన తెలిపారు. ఇంటర్మీడియట్ పరీక్షల జరుగుతున్న తీరును జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీ రావు తో పాటు పలువురు ఉన్నతాధికారులు కేంద్రాలకు వెళ్లి పరిశీలించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement