Monday, November 18, 2024

సాధారణ నేరాలకు పీడీ యాక్ట్‌ వర్తించదు.. హైకోర్టు ధర్మాసనం తీర్పు

అమరావతి, ఆంధ్రప్రభ : సాధారణ చట్టాల కింద నమోదయ్యే నేరాలకు ప్రివెంటివ్‌ డిటెన్షన్‌ (పీడీ)యాక్ట్‌ వర్తించదని హైకోర్టు స్పష్టం చేసింది. అంతేకాదు ఎక్సైజ్‌ చట్టం పరిధిలోని నేరాలకు సైతం పీడీయాక్ట్‌ వర్తింప చేయటం తగదంది.. ప్రజాభద్రత (పబ్లిక్‌ ఆర్డర్‌)కు విఘాతం కలిగించినప్పుడే ఈ యాక్ట్‌ ప్రయోగించాల్సి ఉంటుందని తేల్చిచెప్పింది. సాధారణ చట్టం కింద నమోదయ్యే కేసులకు సైతం పీడీ యాక్ట్‌ను వర్తింప చేయటాన్ని హైకోర్టు ధర్మాసనం తప్పుపట్టింది. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. తూర్పు గోదావరి జిల్లా జగన్నాథపురానికి చెందిన సత్యనారాయణ తన కుమారుడు బాలిన సురేష్‌ ను పీడీయాక్ట్‌ కింద నిర్బంధిస్తూ జారీచేసిన ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ తండ్రి సత్యనారాయణ హైకోర్టును ఆశ్రయించారు. తన కుమారుడిని విడుదల చేసేందుకు ఆదేశాలు జారీ చేయాలని కోర్టును అభ్యర్థించారు.

దీనిపై హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ డీవీఎస్‌ఎస్‌ సోమయాజులు, జస్టిస్‌ బీవీఎల్‌ఎన్‌ చక్రవర్తితో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. పిటిషనర్‌ఒ తరుపున న్యాయవాది తెన్నేటి బాబూజీ వాదనలు వినిపించారు. పిటిషనర్‌ కేసులకు సంబంధించి ఇప్పటికే సంబంధిత న్యాయస్థానం బెయిల్‌ ఉత్తర్వులు జారీ చేసిందని అతనిపై అన్నీ ఎక్సైజ్‌ కేసులే నమోదయ్యాయని ధర్మాసనం దృష్టికి తెచ్చారు. ఈ నేరాలకు పీడీ యాక్ట్‌ విధించటం సరికాదని గతంలో హైకోర్టు స్పష్టం చేసిందని గుర్తుచేశారు. గత ఏడాదే దీనిపై హైకోర్టు ధర్మాసనం తీర్పునిచ్చిందని గుర్తుచేశారు. సాధారణ చట్టాల వల్ల ఫలితంలేదని భావించినప్పుుడు, భవిష్యత్తులో నేరాలను నిరోధించగలమనే భావించినప్పుడే పీడీ యాక్ట్‌ ను ప్రయోగించాల్సి ఉంటుందన్నారు. పబ్లిక్‌ ఆర్డర్‌కు విఘాతం కలిగిన సందర్భాల్లో కూడా పీడీ యాక్ట్‌ వర్తింప చేస్తారన్నారు. ప్రస్తుత కేసులో అంతటి పరిస్థితులు లేవన్నారు.

- Advertisement -

ప్రభుత్వ న్యాయవాది (ఎక్సైజ్‌) ఖాదర్‌ మస్తాన్‌ జోక్యం చేసుకుంటూ పిటిషనర్‌ కల్తీ మద్యం వ్యాపారం చేస్తూ పట్టుబడ్డాడనని ధర్మాసనానికి వివరించారు. ప్రజల ప్రాణాలకు ముప్పుగా పరిణమించిన కల్తీ మద్యం వ్యాపారానికి సంబంధించి అతనిపై అనేక కేసులు నమోదయ్యాయని చెప్పారు. ప్రాణహానిగా ఉన్న తీవ్రమైన నేరాలకు పాల్పడుతున్నంందునే అతనిపై పీడీ యాక్ట్‌ ప్రయోగించారని తెలిపారు. తమకు అందిన ఆధారాలన్నీ పరిశీలించిన తరువాతే పోలీసులు నిర్బంధ ఉత్తర్వులు జారీ చేశారని ప్రభుత్వం కూడా దీన్ని సమర్థించిందని గుర్తుచేశారు. కల్తీ మద్యం ప్రజల ప్రాణాలకు ముప్పుగా పరిణమించినా అదే పనిగా అలవాటుగా కల్తీ మద్యం విక్రయిస్తున్నాడని కోర్టు దృష్టికి తెచ్చారు. వాదనలు విన్న ధర్మాసనం తాజాగా తీర్పును వెలువరించింది. ఈ వ్యవహారంలో పీడీ యాక్ట్‌ ప్రయోగించాల్సినంత తీవ్రత ఏదీలేదని స్పష్టం చేసింది. పిటిషనర్‌పై నమోదైనవి ఎక్సైజ్‌ కేసులే అనే అతని తరపు న్యాయవాది వాదనలతో ఏకీభవించింది.

ఈ కేసుల వల్ల పబ్లిక్‌ ఆర్డర్‌కు విఘాతం కలగదని అభిప్రాయపడింది. విఘాతం కలిగే పరిస్థితులు ఉత్పన్నమైతేనే ఈ యాక్ట్‌ను ప్రయోగించాల్సి ఉంటుందని పిటిషనర్‌కు జారీచేసిన నిర్బంధ ఉత్తర్వుల్లో లోటుపాట్లు ఉన్నట్లు తేల్చింది. ఇతర కేసుల్లో విచారణ పూర్తయి అతను హాజరయ్యే పరిస్థితులు లేకపోతే వెంటనే విడుదల చేయాలని ఆదేశించింది. పీడీ యాక్ట్‌ ప్రయోగిస్తూ పిటిషనర్‌కు జారీచేసిన నిర్బంధ ఉత్తర్వులను కొట్టేస్తూ తీర్పునిచ్చింది. ఓ వ్యక్తి చర్యలు పబ్లిక్‌ ఆర్డర్‌కు విఘాతం కలిగించేలా ఉన్నప్పుడు మాత్రమే పీడీ యాక్ట్‌ వర్తింప చేయాలని పోలీసులకు సూచించింది. సాధారణ చట్టాల కింద నమోదయ్యే కేసులకు ఈ యాక్టు వర్తింపచేస్తూ నిర్బంధించటం తగదని తేల్చిచెప్పింది. ప్రొహిబిషన్‌, ఎక్సైజ్‌ చట్టాల కింద నమోదయ్యే నేరాలకు పీడీ యాక్ట్‌ వర్తింప చేయటం తగదని పునరుద్ఘాటించింది. ఈ వివాదంలో నిర్బంధించిన వ్యక్తిని మరే ఇతర కేసులో అవసరం లేదని భావిస్తే తక్షణమే విడుదల చేయాలని అధికారులను ఆదేశించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement