ఏపీలో చేపట్టి బీజేపీ నిర్వహించనున్నప్రజాగ్రహ సభపై టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ విమర్శలు గుప్పించారు. బీజేపీ ప్రజాగ్రహ సభ ఓ బూటకమన్న ఆయన.. ఈ సంవత్సరానికి అతిపెద్ద జోక్ గా అభివర్ణించారు. దేశంలో బీజేపీ వేరు… రాష్ట్రంలో బీజేపీ వేరని అన్నారు. దేశంలో పార్టీకి జనసేన మిత్రపక్షం అయితే ఇక్కడ జగన్ సేన మిత్రపక్షం అని ఎద్దేవా చేశారు. ఏపీలో భారతీయ జగన్ పార్టీ కొనసాగుతోందని వ్యాఖ్యానించారు.
ఏపీపై కేంద్రం టెలిస్కోప్ లో చూస్తోందని చెబుతోందన్న బీజేపీ ఎంపీపై మండిపడ్డారు. ఇక్కడ సినిమా స్కోప్ లో కనిపిస్తోందన్నారు. విజయవాడలో జరుగుతున్నది ప్రజాగ్రహ సభ కాదు జగన్ అనుగ్రహ సభ అని ఆరోపించారు. కేంద్రంలో నాయకత్వం కరెక్ట్ గానే ఉందన్నారు. రాజధాని అంశంపై అమిత్ షా చెబితే తప్ప ఇక్కడి వారు రాజధానికి మద్దతు అంశం మర్చిపోయారని విమర్శించారు. చైనాలో పుట్టిన కరోనాకు మందు కనుక్కున్నాం కానీ, రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలకు మందు కనుక్కోలేదన్నారు. బీజేపీ బ్రాండ్ హిందుత్వపై దాడులు జరుగుతుంటే ఇక్కడ మౌనంగా ఉంటుందన్నారు. ఆలయ ధర్మకర్త అశోక్ గజపతిరాజుపై దాడి జరిగితే మౌనంగా ఉన్నారని మండిపడ్డారు. దేశం మొత్తంలో బీజేపీ మోడీ, అమిత్ షా ఆదేశాలతో పనిచేస్తుంటే.. ఇక్కడ జగన్ కనుసన్నుల్లో పనిచేస్తోందని ఆరోపించారు. ఓ ఎంపీని చంపే అంత పని చేశారన్నారు. బాబాయిని చంపితే ఇప్పటికీ నిందితులు ఎవరో తెలియదని విమర్శించారు. ఓ డాక్టర్ ని కొట్టి చంపితే అతిగతి లేదనంటూ మండిపడ్డారు.
రాష్ట్రంలో జరుగుతున్న ఆర్థిక అత్యాచారాలపై ఉన్నత స్థాయిలో విచారణ జరిపించే దమ్ము ఉందా? అని పయ్యావుల ప్రశ్నించారు. రాష్ట్ర బీజేపీలో ట్రాన్స్ లేషన్, ట్రాన్స్ మిషన్ లాసెస్ చాలా ఉన్నాయన్నారు. ప్రజల కంటే ప్రభుత్వం కోసం ఇక్కడ పార్టీ పనిచేస్తోందన్నారు. కేంద్రం ఇచ్చిన నిధులకు రాష్ట్రం ముద్ర వెసుకుంటే… పంచాయతీ నిధులు వాడుకుంటే ఇక్కడి బీజేపీకి సమ్మతమే అని ఎద్దేవా చేశారు. ఏపీ బీజేపీ నేతలు.. ప్రభుత్వం కోసం పనిచేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్ర బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే నేటి సభలో ప్రభుత్వంపై వైఖరి ప్రకటించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీగా ప్రజల పక్షాన టీడీపీ పోరాడుతోందని స్పష్టం చేశారు. ఏపీలో టీడీపీ అధికారంలోకి వస్తుందని పయ్యావుల ధీమా వ్యక్తం చేశారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital