Friday, November 22, 2024

AP | విశాఖకు పవన్.. ఉత్తరాంధ్ర నేతలతో కీలక సమావేశాలు

అమరావతి, ఆంధ్రప్రభ: ఎన్నికల ప్రచారంలో భాగంగా జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ నేడు విశాఖకు చేరుకోనున్నారు. విశాఖలో రెండు రోజులపాటు పార్టీ ముఖ్య నేతలతో వరుస సమావేశాలు నిర్వహించనున్నారు. పవన్‌ కల్యాణ్‌ సోదరుడు నాగబాబు అనకాపల్లి నుంచి ఎంపీగా పోటీ చేస్తారంటూ కొంత కాలంగా విస్తృతంగా ప్రచారం జరుగుతుంది. పవన్‌ విశాఖ పర్యటనలో భాగంగా నాగబాబు పోటీపై స్పష్టత ఇచ్చే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నారు.

ఎన్నికల ప్రచారంలో భాగంగా తొలుత ఈ నెల 14 నుంచి 17 వరకు ఉభయ గోదావరి జిల్లాల పర్యటనలకు షెడ్యూల్‌ ఖరారు చేసుకున్నారు. పర్యటనలో భాగంగా తొలిరోజు పవన్‌ కల్యాణ్‌ భీమవరం చేరుకోవడానికి హెలికాఫ్టర్‌ను సిద్ధం చేసుకున్నారు. భీమవరంలో హెలికాఫ్టర్‌ ల్యాండ్‌ అవడానికి అధికారులు అనుమతించకపోవడంతో పవన్‌ ఏకంగా పర్యటనల షెడ్యూల్‌ను వాయిదా వేశారు.

షెడ్యూల్‌లో భాగంగా 17వ తేదీ వరకు ఉభయ గోదావరి జిల్లాల్లో పర్యటించకుండానే సమయం ముగియడంతో నేటి నుంచి ఉత్తరాంధ్రపై దృష్టి పెట్టాలని నిర్ణయించారు. జనసేనకు ఆది నుంచి ఉభయ గోదావరి జిల్లాలతో పాటు ఉత్తరాంధ్రలో మంచి పట్టు ఉంది. రాష్ట్రంలో పవన్‌ కల్యాణ్‌ నిర్వహించిన సర్వేలో కూడా ఉభయ గోదావరి జిల్లాల తదుపరి ఉత్తరాంధ్రలో అత్యధిక శాతం ఓటు బ్యాంకు ఉన్నట్లు వెల్లడయ్యింది.

ఈ రెండు ప్రాంతాలకు చెందిన కొంతమంది కీలక నేతలు జనసేన నుంచి ప్రాతినిధ్యం వహిస్తుండటం ఆ పార్టీకి కలిసొచ్చే అంశం. ఈ నేపథ్యంలో పార్టీకి అనుకూలంగా ఉండే వనరులను సద్వినియోగం చేసుకోవాలని ఈ ప్రాంతాలకు పవన్‌ ప్రాధాన్యతను ఇస్తున్నారు. రెండు రోజులపాటు విశాఖతో పాటు, విజయనగరం, శ్రీకాకుళంకు చెందిన ముఖ్య నేతలో వేరు వేరుగా భేటీ అయ్యి ఎన్నికలకు సమాయత్తం చేయనున్నట్లు తెలుస్తుంది. నేడు, రేపు విశాఖలో బహిరంగ సమావేశాల నిర్వహణపై పార్టీ కార్యాలయం అధికారికంగా ప్రకటించలేదు. వీరితో దాదాపు అంతర్గత చర్చలు జరుపనున్నట్లు తెలుస్తుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement