జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభంకు వెంటనే క్షమాపణ చెప్పాలని సినీ నటుడు, దర్శకుడు, వైసీపీ నేత పోసాని కృష్ణమురళీ డిమాండ్ చేశారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం మధ్య మొదలైన వివాదం మరింత ముదురుతోంది. వారాహి విజయయాత్రలో భాగంగా కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి, కాపు నేతలపై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై ఇప్పటికే ముద్రగడ పద్మనాభం ఘాటుగా స్పందించగా.. తాజాగా పోసాని కృష్ణమురళి కూడా జనసేనానిపై విరుచుకుపడ్డారు.
పవన్‌కళ్యాణ్ వెంటనే ముద్రగడకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. పవన్ కళ్యాణ్ కంటే కూడా ముద్రగడ గొప్ప లీడర్ అని పోసాని కృష్ణమురళి అన్నారు. ఆయన ఏ రోజు రాజకీయంగా, ఆర్థికంగా లబ్ధి పొందలేదని తెలిపారు. చంద్రబాబు డైరెక్షన్‌లోనే పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారని విమర్శించారు. పవన్ వల్లే కాపుల్లో చిచ్చు మొదలైందని ఆరోపించారు. పవన్ కళ్యాణ్ తప్పు చేస్తున్నావ్ అని హెచ్చరించారు. వచ్చే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా గెలుస్తాడో లేడో కూడా తెలియదని ఎద్దేవా చేశారు. సినిమా ఆర్టిస్ట్ అని మాత్రమే పవన్‌ను చూసేందుకు జనాలు వస్తున్నారని విమర్శించారు. అయినా పవన్ కళ్యాణ్ కాపులను తిట్టి చంద్రబాబును పొగడ్డమేంటని ప్రశ్నించారు. ఈ రోజుల్లో కూడా చంద్రబాబుకి సపోర్ట్ చేయడమేంటని నిలదీశారు. లోకేశ్, చంద్రబాబు కంటే పవన్‌కళ్యాణ్ చాలా మంచివాడు.. ఇప్పుడిలా ఎందుకు అయిపోయాడో తెలియడం లేదని అన్నారు. మీ కాపుల్పి తిట్టుకుని నువ్వే దూరం చేసుకుంటున్నావని పవన్‌కు పోసాని సూచించారు. చంద్రబాబు ఏ రోజు తన వర్గం నేతలను తిట్టలేదని గుర్తుచేశారు.