అమరావతి – ఏపీ అసెంబ్లీ వద్ద శుక్రవారం కీలక సంఘటన చోటు చేసుకుంది. ఒకరేమో డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నారు. మరొకరేమో వైసీపీలో కీలక నేతగా వ్యవహరిస్తున్నారు. వీరిద్దరూ కరచాలనం చేసుకోవడం ఇప్పుడు సంచలనంగా మారింది. రాజకీయాలలో ఏదైనా సాధ్యమేనంటున్నారు వీరిద్దరి కరచాలనాన్ని దగ్గర నుండి చూసిన పార్టీల నాయకులు.
వివరాలలోకి వెళితే ఏపీ అసెంబ్లీ వద్ద శుక్రవారం పీఎసీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికలను టీడీపీ కూటమి ప్రభుత్వం, వైసీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకోగా ఎన్నిక అనివార్యమైంది. ఈ ఎన్నికలలో తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు సభ్యులు అసెంబ్లీ వద్దకు రాగా, అసెంబ్లీ వద్ద సందడి సందడిగా మారింది.
ఈ నేపథ్యంలో జనసేన పార్టీ అధ్యక్షులు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన ఓటు హక్కును వినియోగించుకున్నందుకు అసెంబ్లీ వద్దకు చేరుకున్నారు. అదే సమయానికి అసెంబ్లీ నుండి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ బయటకు వస్తుండగా చూశారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఈ క్రమంలో బొత్స సత్యనారాయణ ఏకంగా వెళ్లి పవన్ కళ్యాణ్ తో చేతులు కలిపారు. అయనకు షేక్ హ్యాండ్ ఇచ్చి అప్యాయంగా పలకించారు. ఈ సందర్భంగా ఇద్దరు చిరునవ్వులు చిందించి కొద్ది క్షణాలు మాట్లాడుకున్నారు.