Friday, November 22, 2024

ప‌వ‌న్ కల్యాణ్ ను అడ్డుకున్న పోలీసులు – గ‌రిక‌పాడు వ‌ద్ద రోడ్డుపై పడుకుని నిర‌స‌న …

విజయవాడ: హైదరాబాద్‌ నుంచి రోడ్డు మార్గంలో విజయవాడ బయల్దేరిన జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ను ఎన్టీఆర్‌ జిల్లా గరికపాడు వద్ద పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ప‌వ‌న్ అక్క‌డే రోడ్డుపై ప‌డుకుని నిర‌స‌న‌కు దిగారు.. కాగా, పోలీసుల వైఖరికి నిరసనగా జనసైనికులు నిరసనకు దిగడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పోలీసుల తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేసిన పవన్‌.. ఆంధ్రప్రదేశ్‌లోకి వచ్చేందుకు వీసా, పాస్‌పోర్టు కావాలేమో అంటూ వ్యాఖ్యానించారు.

హైవేపై కాన్వాయ్‌ ఆపడంతో కోదాడ వైపు భారీగా వాహనాలు నిలిచిపోయాయి. దీంతో గరికపాడు వద్ద పవన్‌ కాన్వాయ్‌ను వదిలేసిన పోలీసులు మరోసారి అనుమంచిపల్లి వద్ద అడ్డుకున్నారు. దీంతో పవన్‌ వాహనం దిగి జాతీయ రహదారిపై నడుచుకుంటూ ముందుకు సాగారు. పోలీసులు అప్రమత్తమై ఆయన్ను అక్కడే బలవంతంగా నిలువరించారు. పోలీసుల తీరుకు నిరసనగా పవన్‌ జాతీయ రహదారిపై బైఠాయించి నిరసన తెలుపుతున్నారు. కాలినడక అయినా మంగళగిరి చేరుకోవాలని పవన్‌ నిర్ణయించినట్టు సమాచారం.

కాగా, తెదేపా అధినేత చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో ఆయన్ను పరామర్శించేందుకు, జనసేన కార్యక్రమాల్లో పాల్గొనేందుకు పవన్‌ శనివారం సాయంత్రం బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం వచ్చేందుకు సిద్ధమయ్యారు. అయితే, చివరి నిమిషంలో ఎయిపోర్టు అధికారులు అనుమతి నిరాకరించడంతో వెనుదిరిగారు. పవన్‌ కల్యాణ్ విజయవాడ వస్తే శాంతిభద్రతల సమస్య తలెత్తే అవకాశం ఉందని కృష్ణా జిల్లా ఎస్పీ జాషువా గన్నవరం ఎయిర్‌పోర్టు అధికారులకు మెయిల్‌ పంపారు. దీంతో ఎయిర్‌పోర్టు అధికారులు పవన్‌ విమానానికి అనుమతి నిరాకరించారు. ఈ నేపథ్యంలో పవన్‌ రోడ్డు మార్గంలో విజయవాడ పయనమయ్యారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement