టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు జనసేన పార్టీలో చేరేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. తాజాగా ఆయన మంగళగిరిలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ తో భేటీ అయ్యారు. ఇటీవల వైసీపీలో చేరిన అంబటి రాయుడు.. కొద్దిరోజులకే ఆ పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం పవన్ కల్యాణ్ తో అంబటి భేటీ కావటం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇరువురి మధ్య భేటీలో తాజా రాజకీయాలు, వైసీపీలో ఎందుకు చేరాల్సి వచ్చింది? ఎందుకు మళ్లీ రాజీనామా చేయాల్సి వచ్చిందనే విషయాలపై పవన్ కు అంబటి వివరించినట్లు తెలుస్తోంది.
అయితే, త్వరలోనే అంబటి రాయుడు జనసేనలోకి చేరేందుకు సిద్ధమయ్యారని, ఆ ప్రక్రియలో భాగంగానే పవన్ కల్యాణ్ తో భేటీ అయ్యారని ఏపీ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. తెలుగుదేశం, జనసేన పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా ఆయన గుంటూరు పార్లమెంట్ నుంచి పోటీలోకి దిగుతారని ప్రచారం జరుగుతుంది.
జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను కలిశాక మాజీ క్రికెటర్ అంబటి ఆసక్తికర ట్వీట్ చేశారు. పవన్ కల్యాణ్‌ను ఎందుకు కలిశానన్న విషయంపై స్పష్టతనిచ్చారు. వైసీపీని వీడుతున్నానని, రాజకీయాలకు కొంత కాలం దూరంగా ఉంటానని ఆయన ఇటీవలే ప్రకటన చేసిన విషయం తెలిసిందే.అయితే, ఓ నిర్ణయం తీసుకునే ముందు పవన్ కల్యాణ్ ను కలవాలని తన శ్రేయోభిలాషులు చెప్పారని అంబటి రాయుడు అన్నారు. అందుకే తానే పవన్ కల్యాణ్ ను కలిశానని చెప్పారు. తన భావజాలం, పవన్ భావజాలం ఒకే ఉన్నాయని అన్నారు
— ATR (@RayuduAmbati) January 10, 2024