Tuesday, November 26, 2024

Ap | ఎన్నికల వేళ కుల గణన ఎందుకు? జగన్‌ కు పవన్ కల్యాణ్ లేఖాస్త్రం.. !

ఏపీ సీఎం జగన్‌కు జనసేన అధినేత పవన్ కల్యాణ్ లేఖ రాశారు. ఏపీలో కులం పేరుతో మీ రాజ్యాంగేతర వాలంటీర్ వ్యవస్థ సున్నితమైన వ్యక్తిగత సమాచారాన్ని సేకరిస్తున్నదని… అందుకే ఈ లేఖ రాస్తున్నానని పవన్ స్పష్టం చేశారు. అందుకే జనసేన పార్టీ మిమ్మల్ని ప్రజల తరపున కొన్ని ప్రశ్నలు అడుగుతోంది… దయచేసి సమాధానం చెప్పండి అని కోరారు. ప‌వ‌న్ క‌ల్యాణ్ రాసిన లేఖ‌లో మెత్తం 12 ప్రశ్నలు వచ్చాయి. వీటన్నింటికీ గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి సమాధానం చెప్పాలని స్పష్టం చేశారు.

కులగణన ఉద్దేశం ఎన్నికల ముందే ఎందుకు వచ్చింది? ఈ ప్రక్రియకు కారణాలు వివరిస్తూ గెజిట్‌ నోటిఫికేషన్‌ ఎందుకు విడుదల చేయలేదు? ఆర్టికల్ 21 ప్రకారం వ్యక్తిగత గోప్యత, భద్రత, స్వేచ్ఛను హరించడం కాదా? కులగణన మీ ఉద్దేశం అయితే.. ఉపకులం, ఆదాయం, భూములు, కోళ్లు, మేకలు, ఆవులు, గేదెల వివరాలన్నీ ఎందుకు? బిహార్‌ ప్రభుత్వం చేసిన కులగణనపై సుప్రీంకోర్టులో కేసు ఉన్న నేపథ్యంలో..తీర్పు రాకముందే మీ స్వీయ ప్రయోజనాలకు ఎందుకు ప్రజాధనాన్ని వృథా చేస్తున్నారు.?

కులగణన ప్రక్రియను ఎంతో మంది నిపుణులతో చేయాల్సి ఉంటుంది. మీ వాలంటీర్లకు ఆ అర్హత, సామర్థ్యాలు ఉన్నాయని ఎలా నిర్ధరించారు? గతంలో కేంబ్రిడ్జి అనలిటికా ఇలాంటి డేటా సేకరణ ప్రక్రియను చేసినప్పుడు అది ఏ విధంగా సమాజంలో అశాంతి, అల్లర్లను ప్రేరేపించిన విషయం మీకు తెలియదా? వాటిని ఎన్నికల కోసం స్వీయ ప్రయోజనాలకు ఎలా వాడుకున్నారో మాకు తెలియదనుకుంటున్నారా. ?

ఇవన్నీ మీ అధికార దాహానికి ప్రతీక కాదా? ఒక వేళ కాకపోతే.. ఇలా సేకరించిన డేటా ఏ విధంగానూ దుర్వినియోగం కాకుండా మీరు తీసుకున్న చర్యలేమిటి?ప్రజల నుంచి డేటా సమ్మతి అనేది మీరు ఎలా తీసుకుంటున్నారు? అందరూ మీ నియంతృత్వానికి తలవంచుతారని భావిస్తున్నారా? ప్రభుత్వ వనరులు, యంత్రాంగాన్ని స్వీయ ప్రయోజనాలకు వాడుకోవడం, దేశ రాజ్యాంగానికి, ప్రజాస్వామ్యానికి తూట్లు పొడవటం కాదా?వాలంటీర్ల ద్వారా వైకాపా ప్రభుత్వం సేకరిస్తున్న కులగణన, ఇతర వివరాలను ఏ కంపెనీలో భద్రపరుస్తారనే అంశంపై శ్వేతపత్రం విడుదల చేయాలి..

వైకాపా ప్రభుత్వం చేస్తున్న రాజ్యాంగ వ్యతిరేక కార్యక్రమాలపై రాజకీయంగానే న్యాయపరమైన మార్గాలను కూడా ఆలోచిస్తాం అని పవన్‌ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement