అమరావతి, ఆంధ్రప్రభ: అనుభవజ్ఞులైన రాజకీయ నాయకులు, మాజీ మంత్రి చేగొండి హరిరామ జోగయ్య యోగక్షేమాలు, ఆరోగ్యం గురించి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కల్యాణ్ వాకబు చేశారు. ఇటీ-వల హరిరామ జోగయ్య ఇంట్లో పడిపోయారనే విషయం పవన్ కల్యాణ్ దృష్టికి వచ్చింది. జనసేన పార్టీ పీఏసీ సభ్యులు, హరిరామ జోగయ్య కుమారుడైన చేగొండి సూర్యప్రకాశ్‌ను పిలిపించుకొని మాట్లాడారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పర్యటనకు వచ్చినప్పుడు హరిరామ జోగయ్యను కలుస్తానని చెప్పారు. హరిరామజోగయ్య అంటే పవన్ కల్యాణ్‌కు గౌరవభావం ఉన్న విషయం తెలిసిందే. ఎప్పటికప్పుడు ఆయన యోగక్షేమాలను తెలుసుకొంటూ ఉంటారు. గతంలో హైదరాబాద్ లో చికిత్స పొందిన సమయంలోనూ ఆసుపత్రికి వెళ్ళి పరామర్శించారు.
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఘటన దురదృష్టకరం..
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఉదయం చోటు చేసుకున్న ఘటనలు దురదృష్టకరమైనవని పవన్ కల్యాణ్ ఆందోళన వ్యక్తం చేశారు. అగ్నిపథ్ పథకం ద్వారా ఆర్మీ రిక్రూట్మెంట్ విధానంపై చేపట్టిన ఈ నిరసనల నేపథ్యంలో జరిగిన ఈ సంఘటనలు ఆవేదన కలిగించాయన్నారు. పోలీసు కాల్పుల్లో మృతి చెందిన యువకుడి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకొనే మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నానన్నారు.
సూర్యారావు కుటుంబానికి ప్రగాఢ సానుభూతి..
జనసేన పార్టీ నాయకులు యిర్రింకి సూర్యారావు తల్లి అనంత సత్యవతి మరణం పట్ల సంతాపం వ్యక్తం చేస్తున్నానని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నానన్నారు. సూర్యారావు కుటుంబానికి తన తరఫున, పార్టీ పక్షాన సానుభూతి తెలియజేశారు.
బాసర ట్రిపుల్ ఐటీ సమస్యలు పరిష్కరించాలి..
బాసరలోని రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్(ట్రిపుల్ ఐటీ)లో విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సానుకూల చర్యలు చేపట్టాలని పవన్ కల్యాణ్ విజ్ఞప్తి చేశారు. విద్యార్థులు ఆందోళన విరమించే దిశగా ప్రభుత్వం స్పందించాలని విజ్ఞప్తి చేస్తున్నానన్నారు. ట్రిపుల్ ఐటీలను ఏ లక్ష్యం కోసం స్థాపించారో అది నెరవేరే విధంగా ప్రభుత్వ యంత్రాంగం కృషి చేయాలని కోరారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.