Wednesday, November 20, 2024

రేపు తిరుపతికి పవన్‌ కల్యాణ్‌.. శ్రీకాళహస్తి సీఐపై ఎస్పీకి పిర్యాదు చేయనున్న జనసేనాని

తిరుపతి, ప్రభ న్యూస్‌ బ్యూరో: జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ సోమవారం తిరుపతికి రానున్నారు. జనసేన నాయకుడు కొట్టే సాయిపై చేయి చేసుకున్న శ్రీకాళహస్తి సీఐ అంజూ యాదవ్‌పై ఆయన తిరుపతి ఎస్పీకి ఫిర్యాదు చేయనున్నారు. జనసేన నాయకుడు సాయిపై అమానుషంగా దాడి చేసిన సీఐ అంజూ యాదవ్‌ పై చర్యలు తీసుకోవాలని కోరనున్నారు. ఈ మేరకు పవన్‌ కల్యాణ్‌ తిరుపతి జిల్లా ఎస్పీకి వినతిపత్రం సమర్పిస్తారని జనసేన పార్టీ నాయకులు చెప్పారు.

పవన్‌ తిరుపతి పర్యటన ఇలా..

పవన్‌ కల్యాణ్‌ సోమవారం ఉదయం 9.30 రేణిగుంట విమానాశ్రయం చేరుకుంటారు. ఉదయం 10. 30 గంటలకు జిల్లా ఎస్పీ కార్యాలయానికి వెళ్లి వినతి పత్రం అందించనున్నారు. అలాగే జనసేన నాయకుడు సాయిని కూడా పవన్‌ కల్యాణ్‌ పరామర్శించనున్నారు. ఇందుకు సంబంధించి జనసేన నాయకులు డాక్టర్‌ హరిప్రసాద్‌, కిరణ్‌ రాయల్‌ తో పాటు శనివారం ఉమ్మడి చిత్తూరు జిల్లా జనసేన నాయకులతో టెలీ కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్‌ మాట్లాడుతూ.. పవన్‌ కళ్యాణ్‌ పాల్గొనే ఈ కార్యక్రమాన్ని శాంతియుత, క్రమశిక్షణతో కూడిన వాతావరణంలో నిర్వహించేలా ఏర్పాట్లు చేయాలని పార్టీ శ్రేణులకు సూచించారు. జనసేన నాయకుడు సాయిపై అమానుష దాడి ఘటనను జిల్లా ఎస్పీ ద్వారా రాష్ట్ర డీజీపీ దృష్టికీ తీసుకువెళ్లాలని నిర్ణయించినట్టు చెప్పారు. ఈ టెలీ కాన్ఫరెన్స్‌ లో ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు పసుపులేటి హరిప్రసాద్‌, జిల్లా ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

జరిగింది ఇది…

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ వాలంటీ-ర్ల వ్యవస్థపై చేసిన కామెంట్స్‌కు వ్యతిరేకంగా వైసీపీ నేతలు, వాలంటీ-ర్లు నిరసనలు చేపట్టిన సంగతి తెలిసిందే. మరోవైపు పవన్‌ కల్యాణ్‌కు మద్దతుగా వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జనసేన శ్రేణులు కూడా రోడ్ల మీదకు వచ్చారు. ఈ క్రమంలోనే శ్రీకాళహస్తిలో నిరసన చేపట్టిన జనసేన శ్రేణులు వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ క్రమంలోనే వారిని పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీసు స్టేషన్‌కు తరలించారు. అక్కడ స్థానిక జనసేన నేత సాయిపై అంజు యాదవ్‌ చేయి చేసుకున్నారు. చెంప దెబ్బ కొట్టారు. దీంతో పోలీసులకు, జనసేన శ్రేణులకు మధ్య వాగ్వాదం చోటు-చేసుకుంది.ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. అందులో సీఐ అంజూ యాదవ్‌ తన రెండు చేతులతో ఆ వ్యక్తిని కొట్టడం కనిపించింది. సీఐ అంజూ యాదవ్‌ తీరును జనసేన నేతలు ఖండించారు. ఆమె వైసీపీ కార్యకర్తలా ప్రవర్తించారని ఆరోపించారు

Advertisement

తాజా వార్తలు

Advertisement