Friday, November 22, 2024

Vizag Steel Plant: పవన్ కల్యాణ్ ఉక్కు దీక్ష.. బీజేపీపై సమరమేనా?

జన‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ దీక్షకు సిద్ధమైయ్యారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికుల‌ ఆందోళనకు సంఘీభావంగా గుంటూరు జిల్లా మంగళగిరిలోని జనసేన ప్రధాన కార్యాలయంలో ఇవాళ దీక్ష చేయనున్నారు. ఉదయం 10 నుంచి సాయంత్రం 5గంటల వరకు దీక్ష కొనసాగనుంది.

విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులు 300 రోజులుగా ఆందోళన చేస్తున్నారు. అన్ని పార్టీలు మద్దతు వారి పోరాటానికి మద్దతు ప్రకటించాయి. ఇటీవల విశాఖ స్టీల్‌ ఫ్లాంట్ ప్రైవేటీక‌ర‌ణపై పున‌రాలోచించాల‌ని పవన్ కల్యాణ్ కేంద్రాన్ని కోరారు. అయితే, ఈ విషయంలో కేంద్రం మాత్రం వెన‌క్కు త‌గ్గేది లేద‌ని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలోనే పవన్ కల్యాణ్ దీక్షకు సిద్ధమైనట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే, ఏపీలో బీజేపీతో భాగ్యస్వామ్యంగా ఉన్న పవన్‌ కల్యాణ్.. ఇప్పుడు విశాఖ స్టీల్‌ ప్లాంట్ ప్రైవేటీకరణపై దీక్షకు దిగడం రాజకీయంగా వేడి పుట్టిస్తోంది. కేంద్రంలోని బీజేపీ సర్కార్ పై సమర శంఖం పూరిస్తున్నారా? అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

పవన్ విశాఖ సభలో రాష్ట్ర ప్రభుత్వాన్ని టార్గెట్ గా చేసుకొని విమర్శలు చేసారు. ఇప్పుడు ఈ దీక్ష వేదికగా మరోసారి జగన్ ప్రభుత్వాన్ని విమర్శిస్తారా.. లేక, నిర్ణయం తీసుకోవాల్సిన కేంద్రం పైన మాట్లాడతారా అనేది తేలాల్సి ఉంది. ఇదే సమయంలో పవన్ కళ్యాణ్ నేరుగా కేంద్ర నిర్ణయానికి వ్యతిరేకంగా చేస్తున్న దీక్షగా పార్టీ నేతలు చెబుతున్నారు.

మరోవైపు ఏపీలో బీజేపీ – జనసేన మైత్రికి బీటలు వారుతున్నాయి అనే ప్రచారం జరుగుతోంది. ఇరు పార్టీల దోస్తీ కేవలం నామ్ కే వాస్తే అన్నట్లుగా మారిపోయింది. ఇటీవల జరిగిన ఉపఎన్నికల్లో బీజేపీకి జనసేన మద్దుతు ఇచ్చింది.  దీంతో ఇప్పుడు పవన్ కళ్యాణ్ బీజేపీ మిత్రపక్షంగా ఉంటూనే దీక్ష చేయటం ద్వారా ఆయన పరోక్షంగా బీజేపీకి దూరమవుతున్నారనే సంకేతాలు ఇస్తున్నారనే చర్చ మొదలైంది.

స్థానిక ఎన్నికల సమయంలో కొన్ని ప్రాంతాల్లో టీడీపీ, జనసేనపార్టీలు కలిసి వైసీపీని ఓడించాయి. ఇరుపార్టీలు వైసీపీని ఓడించడమే లక్ష్యంగా అనధికార పొత్తులతో పోటీ చేసాయి. ఈ క్రమంలో టీడీపీ- జనసేనల జససేన పార్టీల మధ్య ఎన్నికల పొత్తు పొడుస్తోందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. తాజాగా పవన్ దీక్ష బీజేపీతో మైత్రి పైన ప్రభావం చూపిస్తుందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఏపీలో కొత్త రాజకీయ సమీకరణాలకు దారి తీసే అవకాశం ఉందా? లేదా? అన్నది చూడాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement