Friday, November 22, 2024

చెరకు రైతుల బాధలను ప్రభుత్వం ఎందుకు పట్టించుకోదు?

విజయనగరం జిల్లా ఎన్సీఎస్ చక్కెర కర్మాగారం వద్ద బకాయిల కోసం ఆందోళన చేపడుతున్న రైతులకు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ మద్దతు పలికారు. మనకు తీపిని పంచే చెరకు రైతుల జీవితాల్లో చేదు నింపుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. లచ్చయ్యపేట ఎన్సీఎస్ చక్కెర కర్మాగారం వద్ద రైతులు తమకు రావాల్సిన బకాయిల కోసం నెల రోజుల నుంచి ఆందోళన చేస్తున్నారని అన్నారు. అయితే ప్రభుత్వం తగిన విధంగా స్పందించకపోవడంతోనే సమస్య తీవ్రమైందని తెలిపారు.

గత రెండేళ్ల నుంచి చెరకు రైతులకు రూ.16.38 కోట్ల మేర బకాయిలు రావాల్సి ఉందని పవన్ వివరించారు. తమకు రావాల్సిన బకాయిల కోసం రైతులు చేస్తున్న పోరాటాన్ని పాలనా యంత్రాంగం శాంతిభద్రతల సమస్యగా చూడడం సరికాదని హితవు పలికారు. రైతులను అరెస్ట్ చేయడం ద్వారా వారిలో ఆగ్రహాన్ని పెంచారని పేర్కొన్నారు. తక్షణమే బకాయిలు ఇప్పించాల్సిన సర్కారు, జనవరిలో చెల్లింపులు చేసేలా చక్కెర కర్మాగారం యాజమాన్యాన్ని ఒప్పిస్తామని చెప్పడం రైతులను మోసగించడమేనని పవన్ విమర్శించారు. రెవెన్యూ రికవరీ చట్టం ద్వారా బకాయిలు ఇప్పించే వెసులుబాటు ఉన్నా, ఈ చట్టాన్ని ప్రభుత్వం వినియోగించకపోవడంపై సందేహాలు కలుగుతున్నాయని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement