Monday, November 18, 2024

యువ నాయకత్వం వైపు పవన్‌ కల్యాణ్‌ చూపు.. అన్ని నియోజకవర్గాల్లో ఇన్‌చార్జిల నియామకం

అమరావతి,ఆంధ్రప్రభ: ఒకవైపు సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేసుకుంటూనే మరోవైపు రాజకీయంగా దూకుడు పెంచారు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌. విశాఖ ఘటనలు, ఇప్పటం సమస్యపై పవన్‌ కల్యాణ్‌ ఎంతో సంయమనంతో వ్యవహరించడంతోపాటు ఎంతో తెగువను కూడా ప్రదర్శించారు. పోలీసుల వేధింపులను అధిగమించి ఇప్పటం ప్రజల ఎదుర్కొంటున్న సమస్యను రాష్ట్రవ్యాప్తంగా అందరికీ తెలిసేలా ఎలుగెత్తి చాటారు. విశాఖ ఘటనల సందర్భంగానూ పవన్‌ కల్యాణ్‌ చూపించిన సంయమనంతో కూడిన తెగువ రాష్ట్ర వాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించింది.

గతం నుండి జరుపుతున్న జనవాణి, కౌలు రైతులకు భరోసా, పార్టీ కార్యకర్తలకు బీమా చెక్కుల అందజేత, అమరావతి రాజధాని రైతులకు మద్దతు లాంటి నిర్మాణాత్మక కార్యక్రమాలతో పార్టీ పరపతి గత ఎన్నికల ఫలితాల నాటి కంటే మెరుగ్గా ఉండగా విశాఖ, ఇప్పటం ఘటన తర్వాత జనసేనపై రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా క్రేజ్‌ పెరిగింది. ఈ నేపథ్యంలో పార్టీని సంస్థాగతంగా మరింతగా బలపరుచుకునే అంశాలపై పవన్‌ కళ్యాణ్‌ దృష్టి పెట్టబోతున్నారని తెలిసింది.

యువ నాయకత్వంవైపు పవన్‌ చూపు

- Advertisement -

జనసేన పార్టీ కి కార్యకర్తల బలం ఎక్కువగా ఉంది. పవన్‌ కల్యాణ్‌ ఎక్కడికి పర్యటనకు వెళ్లినా వెల్లువగా కార్యకర్తలు ఆ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేస్తున్నారు. యువ నాయకులు ఎక్కువగా జనసేనలో కనిపిస్తున్నారు. సీనియర్‌ నేతలు కాస్త తక్కువగానే ఉన్నారు. ఇతర పార్టీల నుండి కొంతమంది సీనియర్లు పార్టీలోకి వస్తామని సంకేతాలు పంపుతున్నారు. అయితే ప్రధానంగా పవన్‌ మాత్రం యువ నాయకత్వంవైపు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. జనసేనకు ఇప్పటికి అన్ని నియోజకవర్గాలకు ఇంఛార్జ్‌లు లేరు. 40 నుండి 50 నియోజకవర్గాల్లో మాత్రమే ఇంఛార్జ్‌లు చురుగ్గా పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలో అన్ని నియోజకవర్గాలోనూ ఇంఛార్జ్‌లను నియమించేలా పవన్‌ కళ్యాన్‌ కసరత్తు చేస్తున్నారు. అందులోనూ యువతపైనే ఎక్కువగా దృష్టి పెట్టారు. డాక్టర్లు, లాయర్లు లాంటి వివిధ ప్రొఫెషన్స్‌లో కొనసాగుతూ మంచి పేరు తెచ్చుకున్న యువకులపై దృష్టి పెట్టనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement