అసెంబ్లీ ఎన్నికల్లో 21 స్థానాల్లో పోటీ చేసిన జనసేన
పోటీ చేసిన అన్ని స్థానాల్లోనూ ఘన విజయం
21 మంది ఎమ్మెల్యేలు.. జూన్ 21న అసెంబ్లీలోకి
సోషల్ మీడియాలో హల్‌చల్ అవుతున్న టాపిక్
సినిమాల్లోనూ ఇదే తరహా ధోరణి
ప్లాప్ అయిన ప్రతిసారి గమ్మునుండటమే
ఆ తర్వాత మాంచి హిట్ మూవీతో జనంలోకి
పరిస్థితులు నేర్పిన గుణపాఠంతో ఎంతో ఓపిక
మెచ్చుకుంటున్న సినీ, రాజకీయ రంగాల విశ్లేషకులు
జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు.. 21 అంకెకు ఏదో అవినాభావ సంబంధం ఉన్నట్టుంది. అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, బీజేపీతో కలిసి కూటమిగా పోటీ చేసిన జనసేనాని తిరుగులేని విజయాన్ని అందుకున్నారు. పొత్తులో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు.. జనసేనకు 21 సీట్లు కేటాయించారు. పవన్‌కు 21 సీట్లు మాత్రమే ఇవ్వడంపై వైసీపీ తీవ్రంగా హేళన చేసింది. అంత తక్కువ అని, ఇంత అని చివరికి 21 సీట్లకు చంద్రబాబు వద్ద పవన్ లొంగిపోయారని ట్రోల్ చేశారు. అయినప్పటికీ పవన్ వెనక్కి తగ్గలేదు. తాను 21 సీట్లకు ఎందుకు పరిమితం కావాల్సి వచ్చిందో కూడా మీడియా వేదికగా వివరించారు. అదే విషయం పార్టీ నేతలకు చెప్పి ఒప్పించారు.
వందకు వందశాతం ఫలితాలు..
కట్ చేస్తే.. సార్వత్రిక ఎన్నికల్లో మరే పార్టీ సాధించని ఘనతను పవన్ సొంతం చేసుకున్నారు. అసెంబ్లీకి పోటీ చేసిన 21 స్థానాలతోపాటు, పోటీ చేసిన రెండు లోక్‌సభ స్థానాలను కూడా గెలుచుకుని వందకు వంద శాతం విజయం సాధించారు. శుక్రవారం ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. అసెంబ్లీ గేట్లు కూడా పవన్‌ను తాకనివ్వబోమని వైసీపీ నేతలు ప్రచారం చేసిన వేళ 21వ తేదీన, 21 మంది ఎమ్మెల్యేలతో డిప్యూటీ సీఎం హోదాలో పవన్ అసెంబ్లీలో అడుగుపెట్టారు. దీంతో 21వ నంబర్‌కు పవన్‌కు ఏదో అవినాభావ సంబంధం ఉందంటూ జనసేన కార్యకర్తలు, పవన్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా సంతోషం పంచుకుంటూ సంబరాలు చేసుకుంటున్నారు.
పడిన ప్రతిసారి.. గర్వంతో పైకెగురుతూ..
సినీ హీరోగా ఉన్న పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ .. సినీ రంగంలో కూడా ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. కొన్ని సినిమాలు అట్టర్ ప్లాప్ అయి పెద్ద ఎత్తున నష్టం వచ్చినా.. ఎలాంటి భావావేశాలకు లోనుకాకుండా నిబ్బరంగా ఉన్నారు. అయితే.. పడిన ప్రతిసారి అంతే వేగంగా ఎగిసిపడిన అల మాదిరిగా.. పవన్ కళ్యాణ్ తన తదుపరి మూవీని మాంచి హిట్ కొట్టేలా ప్లాన్ చేసుకునేవారు. ఇక.. రాజకీయాల్లోనూ పదేండ్లుగా ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొంటూ వస్తున్నారు. అసలు పవన్ కళ్యాణ్ రాజకీయాలకు పనికిరాడనే విమర్శలను కూడా ఎదుర్కొన్నారు. కుటుంబ పరంగా ఎన్ని విధాల ట్రోల్స్ చేసినా.. అంతే నిబ్బరంగా ఉంటూ ఈ సారి జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఏపీలో ప్రభంజనం సృష్టించారు. దీంతో పవన్ అభిమానులే కాకుండా.. సినీరంగ, రాజకీయ విశ్లేషకులు సైతం జనసేనాని ఓపికను మెచ్చుకుంటున్నారు. హ్యాట్సాఫ్ పవన్ అంటూ.. పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.