పంజాబ్ పర్యటనలో ప్రధాని మోడీని రైతులు అడ్డుకున్న ఘటనపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. పంజాబ్ లో ప్రధాని మోదీకి ఎదురైన సంఘటనను దురదృష్టకరంగా అభివర్ణించారు. దేశ ప్రధాని ప్రయాణంలో 20 నిమిషాలపాటు ముందుకు వెళ్లలేక రోడ్డుపైనే ఆయన కారు నిలిచిపోయే పరిస్థితి అవాంచనీయమని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో నిరసన వ్యక్తం చేయడం ప్రజల హక్కే అయినప్పటికీ ప్రధాని భద్రతకు ఇబ్బంది కలిగేలా ఆ నిరసన ఉండరాదని అన్నారు. ఎటువంటి పరిస్థితులలోనూ ప్రధాన మంత్రిని గౌరవించడం అంటే మన జాతిని, మన దేశాన్ని గౌరవించడమే అని చెప్పారు.
ఈ సంఘటన కావాలని చేసినట్లు తాను భావించడం లేదన్నారు. అయితే ప్రధాన మంత్రి ఇతర రాష్ట్రాలలో పర్యటనకు వచ్చినప్పుడు ప్రోటోకాల్స్ ను తు.చ. తప్పకుండా పాటించాల్సిన బాధ్యత ఆయా రాష్ట్రాలపైనే ఉంటుందన్నారు. మరోసారి ప్రధానికి, అత్యంత బాధ్యతాయుతమైన రాజ్యాంగ పదవుల్లో ఉన్న వారెవరికీ ఇటువంటి పరిస్థితి ఎదురుకాకూడదని కోరుకుంటున్నట్లు చెప్పారు. క్లిష్టపరిస్థితుల్లో సంయమనం పాటించిన ప్రధాని మోదీకి పవన్ కల్యాణ్ అభినందనలు తెలిపారు.
కాగా, ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఈ నెల 5న పంజాబ్ లో రైతులు అడ్డుకున్నారు. పరిపాలన పరంగా దేశంలో అత్యున్నత పదవిలో ఉన్న వ్యక్తికి ప్రొటోకాల్ ప్రకారం పంజాబ్ భద్రత కల్పించలేదని, అందుకే నడిరోడ్డుపై ప్రధాని కాన్వాయ్ నిలిచిపోవాల్సి వచ్చిందని కేంద్రం పెద్దలు, బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. ప్రధాని మోదీ వెళ్లాల్సిన ఫిరోజ్ పూర్ సభకు జనం రాకపోవడం వల్లే సెక్యూరిటీ పేరుతో బీజేపీ డ్రామాలాడుతోందని కాంగ్రెస్ విమర్శిస్తోంది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..