- భయపెట్టి, బాంబులు వేసి స్వాధీనం చేసుకున్నారు
- మాచవరంలో ఉప ముఖ్యమంత్రి పర్యటన
- జగన్ కు కేటాయించిన భూముల పరిశీలన
- అటవీ భూమీ, అసైన్డ్ భూములను లాక్కున్నారు
- ప్రైవేటు భూములను చెరబట్టారు
- రైతు పిల్లలకు ఉద్యోగాలంటూ ఎర
- భారీగా నష్ట పరిహారం ఇస్తామంటూ మోసం
- కృష్ణా జలాలు అడ్డగోలుగా కేటాయింపు
- ఇప్పటికే విచారణ ప్రారంభించాం..
- ఈ భూ దందాలో అందరినీ జైలుకు పంపుతాం
మాచర్ల – మోసం చేసి, భయపెట్టి, బాంబులు వేసి సరస్వతి పవర్ కోసం 1324. 93 ఎకరాల భూమిని చెరబట్టారని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి అధికారంలో ఉండగానే దీనికి నాంది పలికిందని చెప్పారు. జిల్లాలోని మాచవరం మండలంలో మాజీ సిఎం జగన్ కు చెందిన సరస్వతి పవర్ కేటాయించిన భూములను నేడు స్వయంగా పవన్ పరిశీలించారు.. ఈ సందర్భంగా అక్కడ భూములు ఇచ్చిన రైతులతో ఆయన మాట్లాడారు.
అనంతరం పవన్ మాట్లాడుతూ… ఈ భూముల అక్రమాలపై ఇప్పటికే విచారణ ప్రారంభించామన్నారు. ఈ భూముల్లో ఏకంగా 150 ఎకరాలకు పైగా అటవీ భూమి ఉందన్నారు.. ఇక మరో 34ఎకరాలు అసైన్ట్ భూమిని సైతం కబ్జా చేశారన్నారు.. ఇది కాకుండా ఇక్కడ రైతులను మభ్య పెట్టి వారి భూములను సైతం లాక్కున్నారని తెలిపారు.. రైతు పిల్లలకు ఉద్యోగాలు ఇస్తామని, భారీగా నష్ట పరిహారం ఇస్తామని వ్యవసాయ భూములను సైతం లాక్కున్నారని వివరించారు. భూములు ఇవ్వని వారిపై బాంబులు వేశారని, కత్తులతో దాడులు చేశారన్నారు.
భూములిచ్చిన రైతులకు నేటి వరకు నష్టపరిహారం ఇవ్వలేదని, అలాగే ఒక్క రైతుకు నష్టపరిహారం అందలేదని పవన్ చెప్పారు. ఇక ఈ భూములను ఏకంగా జగన్ తాను అధికారంలో ఉండగా 50ఏళ్లకు లీజు తీసుకున్నట్లు జీవో విడుదల చేశారని గుర్తు చేశారు. జగన్ కృష్ణా జలాలను సైతం వదలలేదన్నారు.. అక్రమంగా ఆ నదీ జలాలను తన సిమెంట్ పరిశ్రమ కోసం కేటాయించుకున్నారని మండిపడ్డారు.
సిమెంట్ పరిశ్రమ రాలేదు కానీ, ఈ భూముల నుంచి వేలాది టన్నుల సున్నపు రాయి తరలిపోయిందన్నారు.. ఇలా భూకబ్జాకు పాల్పడిన సరస్వతి పవర్ ను వదిలేది లేదన్నారు. దివంగత నేత కోడెల శివప్రసాద్ తన వద్ద ఫర్నీచర్ ఉంచుకున్నందుకు వేధించి బలవన్మరణానికి కారణమైన నేతలే ఈ దుశ్చర్యలకు పాల్పడ్డారని అన్నారు పవన్. ఈ భూబాగోతంలో ఎవరున్నా వదిలే ప్రసక్తి లేదన్నారు.. కేటాయించిన అధికారుల నుంచి దీనిని కబ్జా చేసిన జగన్ తో సహా ఇతరులను చట్టబద్దంగా శిక్షిస్తామని తేల్చి చెప్పారు పవన్.