ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ వేడి రాజుకుంది. జనసేన, వైసీపీ పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఈ క్రమంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ రాజకీయాలపై సీనియస్ గా దృష్టి పెట్టారు. మంగళగిరిలోని రాష్ట్ర కార్యాలయంలో నేడు జనసేన పార్టీ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి జనసేన అధినేత పవన్ కల్యాణ్, పార్టీ ముఖ్యనేతలు హాజరుకానున్నారు. స్టీల్ ఫ్లాంట్, అమరావతి, శ్రమదానం, బద్వేల్ ఉప ఎన్నిక, ప్రస్తుత రాజకీయ పరిణామాలపై చర్చించనున్నారు. రాష్ట్రంలో ఉన్న ప్రధాన సమస్యలు, ప్రభుత్వ వైఫల్యాలపై సమావేశంలో చర్చ జరగనుందని తెలుస్తోంది. గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న రాష్ట్రవ్యాప్తంగా జరగనున్న శ్రమదానం కార్యక్రమానికి సంబంధించి పార్టీ నేతలకు పవన్ దిశానిర్దేశం చేయనున్నారు. క్షేత్ర స్థాయిలో చేపట్టాల్సిన కార్యక్రమాలపై సమాలోచనలు జరపనున్నారు.
కాగా, ఇటీవల రిపబ్లిక్ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో పవన్ ఏపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. దీంతో ఇప్పుడు ఏపీలో జనసేన వర్సెస్ వైసీపీ అన్నట్టు ఒకరి పై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. ఇదివరకే ఏపీలో రోడ్లు సరిగ్గా లేవని వాటిని తొందరగా మరమ్మత్తు చేయాలని పవన్ కల్యాణ్ ఏపీ ప్రభుత్వాన్ని కోరారు. నెల రోజుల్లో పనులు మొదలు పెట్టాలని కోరారు. ఏపీ ప్రభుత్వానికి అక్టోబర్ ఒకటో తేదీ వరకు గడువు ఇచ్చారు. ఈ లోపు రాష్ట్రంలో పాడయిన రోడ్లను వెంటనే మరమ్మత్తులు చేపట్టాలి అని లేదంటే అక్టోబర్ 2 నుంచి తానే రోడ్ల పైకి వచ్చి మరమ్మత్తులు చేస్తానని పవన్ ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఇది కూడా చదవండి: పంజాబ్ కాంగ్రెస్ లో ఏం జరుగుతోంది?