ఎన్నికలు ఇంకా రెండు సంవత్సరాలు ఉన్నాయని ప్రజల సంక్షేమం కోసం మాత్రమే జనసేన పార్టీ పొత్తు పెట్టుకుంటుందని అధికారం కోసం కాదని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఆదివారం సిరివెళ్ల రచ్చబండ కార్యక్రమంలో భాగంగా గోవింద పల్లె వద్ద విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటే ఇన్ని సంవత్సరాలుగా వైసీపీ ప్రభుత్వం వేడుక చూసిందని విమర్శించారు. జనసేన పార్టీ తరఫున కౌలు రైతులకు రూ.లక్ష ఆర్థిక సహాయం అందజేస్తు ఉంటే దౌర్జన్యంతో వారిని భయపెట్టడం ప్రజలు గమనిస్తూ నట్లు చెప్పారు. ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతులకు ఆర్థిక సహాయం అందజేయడం వైసీపీ ప్రభుత్వానికి గిట్టడం లేదన్నారు. అమ్మ పెట్టదు ఎవరినీ అడగనివ్వదు అని సామెత గుర్తు చేశారు. రాష్ట్రంలో ఆడపిల్లలకు రక్షణ కరువైందని వైసిపి నాయకులు చేస్తున్న అరాచకాలు అంతులేకుండా పోయిందన్నారు. వారికి బుద్ధిచెప్పే సమయం ఆసన్నమైందన్నారు. బిజెపితో జనసేన పొత్తు పొత్తు బలంగా ఉందని ఎన్నికల సమయంలో మిగతా పార్టీలతో పొత్తు గురించి ఆలోచన చేస్తామని వెల్లడించారు. ఎన్నికల సమయానికి అటువంటి అద్భుతం జరిగిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు.
కాగా, ఇటీవల కాకినాడ జిల్లా అన్నవరంలో పర్యటించిన చంద్రబాబు.. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అందరూ కలవాల్సిన అవసరం ఉందని.. ఈ ఉద్యమానికి టీడీపీ న్యాయకత్వం వహిస్తుందన్నారు. అవసరమైతే తెలుగు తమ్ముళ్లు త్యాగాలకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.