Monday, November 18, 2024

AP | ప‌వ‌న్ సార్ మీరు మారిపోయారు : ష‌ర్మిల‌

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మండిపడ్డారు. విజయవాడ కాంగ్రెస్ కార్యాలయంలో షర్మిల మీడియాతో మాట్లాడుతూ.. తిరుపతి వారాహి సభలో కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీపై ప‌వ‌న్ క‌ళ్యాన్ చేసిన‌ వ్యాఖ్యలపై మండిపడ్డారు.

అధికారం వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ వేషం, భాష మారిపోయాయని ఎద్దేవా చేశారు షర్మిల. తిరుపతి సభలో రాహుల్ గాంధీని లక్ష్యంగా చేసుకుని ప‌వ‌న్ క‌ళ్యాన్ చేసిన‌ వ్యాఖ్యలు నిరాధారమైనవి, ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమోదించదగ్గవి కావు అని స్పష్టం చేశారు.

మీ మత రాజకీయాల్లోకి రాహుల్ గాంధీని లాగడాన్ని కాంగ్రెస్ పార్టీ ఖండిస్తోంది అని షర్మిల పేర్కొన్నారు. రాహుల్ గాంధీకి పవన్ కల్యాణ్ బేషరతుగా క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేశారు. పవన్ కళ్యాణ్ ఒకే మతానికి ప్రతినిధిగా వ్యవహరిస్తున్నారని… ఆయన అన్ని మతాలను సమానంగా చూడాలని కోరారు.

ఉపముఖ్యమంత్రి అన్ని వర్గాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. బాధ్యత కలిగిన పదవిలో ఉంటూ… ఒక మతానికి చెందిన వేషం వేసుకుని, ఆ మతమే ముఖ్యమని మాట్లాడుతుంటే, ఇతర మతాలకు అభద్రతా భావం ఉండదా? ఎన్నికల్లో మీకు ఇతర మతాల వారు ఓట్లు వేయలేదా? ఇతర మతాల వారికి మనోభావాలు ఉండవా? అంటూ మండిప‌డ్డారు.

మతాన్ని అడ్డుపెట్టుకుని రాజకీయం చేయడం ఆర్ఎస్ఎస్ సిద్ధాంతమైతే, అదే సిద్ధాంతానికి పవన్ కల్యాణ్ డబుల్ ఏజెంట్ గా మారాడ‌ని విమ‌ర్శించారు. ప్రధాని మోదీ డైరెక్షన్ లో యాక్టింగ్ చేసే మీకు రాహుల్ గాంధీ గురించి మాట్లాడే నైతికత లేదని అన్నారు. దేశంలో ప్రేమ, సమానత్వం, సోదరభావం పెంపొందించేందుకు రాహుల్ గాంధీ వేల కిలోమీటర్లు పాదయాత్ర చేశార‌ని.. అలాంటి వ్యక్తిపై వ్యాఖ్యానించడం తగదని… మీ స్థాయిని తగ్గించుకోవద్దని షర్మిల స్పష్టం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement