కాకినాడ లోక్‌సభ నియోజకవర్గం అభ్యర్థిని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించారు. తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ జనసేన పార్టీ నుంచి పోటీ చేస్తారని ఆయన తెలిపారు. పవణ్ కోసం తన సీటును త్యాగం చేసిన ఉదయ్‌కు కాకినాడ సీటు ఇస్తున్నట్టు ప్రకటించారు. పొత్తులో భాగంగా… కాకినాడ ఎంపీగా ఉదయ్ పోటీ చేస్తారని ఆయన తెలిపారు. పొత్తుల్లో భాగంగా కాకినాడ ఎంపీ సీటు జనసేనదేనని ఆయన చెప్పుకొచ్చారు. ఉదయ్ ఈ స్థానం నుంచి పోటీ చేసి తప్పకుండా గెలుస్తారనే నమ్మకం తనకు ఉందన్నారు. ఉదయ్‌ను గెలిపించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని పవన్ కళ్యాణ్ అన్నారు.
జనసేనలో చేరికలు..
పిఠాపురం నియోజకవర్గం నుంచి జనసేనలో భారీగా చేరికలు జరిగాయి. పవన్ కళ్యాణ్ సమక్షంలో పలువురు నాయకులు జనసేనలో చేరారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. పిఠాపురంలో కులాల ఐక్యత మొదలైందని అన్నారు.. తన గెలుపుకోసమే పిఠాపురం నుంచి పోటీ చేయట్లేదని పవన్ తెలిపారు. గాజువాక, భీమవరంతో పాటు పిఠాపురం కూడా తనకు ముఖ్యమే అన్నారు.
పిఠాపురం నుంచి పోటీ చేయాలని ఎక్కువ మంది కోరారన్నారు. తనను అసెంబ్లీకి పంపిస్తామని చాలామంది హామీ ఇచ్చారని వెల్లడించారు. ఇక నుంచి పిఠాపురాన్ని తన స్వస్థలం చేసుకుంటానని పవన్ పేర్కొన్నారు. పిఠాపురం నుంచి పోటీ చేసే అవకాశం కల్పించిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. 2019లో పిఠాపురం నుంచి పోటీ చేయమంటే ఆలోచించా. పిఠాపురాన్ని ఒక నియోజకవర్గంగా చూడలేదు. పిఠాపురం చాలా ప్రత్యేకమైన నియోజకవర్గం అని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.