విశాఖపట్నం, ఆంధ్ర ప్రభ బ్యూరో, ఆగస్టు 11: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడుకి బానిసగా బతుకుతున్నాడని ఆయన బానిసత్వాన్ని చూసి జాలేస్తోందని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. గురువారం విశాఖలో పవన్ కళ్యాణ్ నిర్వహించిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పైన, రాష్ట్ర ప్రభుత్వంపైన చేసిన వ్యాఖ్యలకు మంత్రి అమర్నాథ్ కౌంటర్ ఇచ్చారు. స్థానిక సర్క్యూట్ హౌస్ లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ… పవన్ విశాఖ సభలో విద్వేష పూరిత ప్రసంగం చేశారన్నారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండకూడదని చెప్పారు కానీ, తనను సీఎం చేయమని ప్రజలను ఎక్కడా కోరలేదని అమర్నాథ్ అన్నారు. రాజకీయాలపై ఆయనకు ఏమాత్రం అవగాహన ఉన్నా, ఆయన పార్టీ సిద్ధాంతాలు పార్టీ విజయానికి అవసరమైన ప్రణాళికల గురించి మాట్లాడి ఉండేవారని, ఆయన ప్రసంగంలో ఇటువంటివి ఎక్కడా మచ్చ కైనా కనిపించలేదని అమర్నాథ్ వ్యాఖ్యనించారు.
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని తిడితే నాయకుడిని అయిపోతానన్న భ్రమలో పవన్ కళ్యాణ్ ఉన్నారని, ఆ భ్రమలోంచి ఆయన బయటకు రావాలని అమర్నాథ్ విజ్ఞప్తి చేశారు. చంద్రబాబు నాయుడు రాసిచ్చిన స్క్రిప్ట్ ని మాత్రమే చదివి వినిపించాడని ఎద్దేవా చేశారు. ‘ అల్పుడెపుడు పలుకు ఆడంబరము గాను సజ్జనుండు పలుకు చల్లగాను”.. అన్న వేమన పద్యాన్ని అమర్నాథ్ ఉటంకిస్తూనే ఏమీలేని ఆకు ఎగిరెగిరి పడుతుందని, అన్నీ ఉన్న ఆకు అణిగి మణిగి ఉంటుంది అన్న సామెతను చెబుతూ పవన్ కళ్యాణ్ కు పొలిటికల్ ఐడెంటిటీ లేదని అందుకే అలా మాట్లాడుతున్నాడని, రాజకీయ పరిజ్ఞానం పూర్తిగా ఉంది కనుకనే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సంయమనం పాటిస్తున్నారని అమర్నాథ్ చెప్పారు. 15 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్న పవన్ కళ్యాణ్ ఆయన పార్టీకి ఒక విధానం, సిద్ధాంతం, స్థిరత్వం లేకుండా చేసుకున్నాడని మంత్రి అన్నారు. తనవి విప్లవ భావాలను చెప్పుకుంటున్న పవన్ బిజెపితో ఎలా అంటకాగుతున్నారని అమర్నాథ్ ప్రశ్నించారు.
పవన్ కళ్యాణ్ విశాఖ సభలో మాట్లాడినప్పుడు ఈ ప్రాంతానికి ఏం మేలు చేస్తాడో చెప్పలేకపోయాడు. పొరపాటున ఆయన అధికారంలోకి వస్తే ఎటువంటి పథకాలు అమలు చేస్తాడో మచ్చుకైనా చెప్పలేదు. పొలిటికల్ ప్రొడ్యూసర్ చంద్రబాబు నాయుడు స్కీములే ఆయన స్కీములుగా భావిస్తున్నాడేమోనన్న అభిప్రాయాన్ని అమర్నాథ్ వ్యక్తం చేశారు. రాజకీయంగా ఇన్ని లోపాలున్న పవన్ కళ్యాణ్ అతనిని నమ్ముకుని వచ్చిన వారికి ఏం న్యాయం చేస్తారని అమర్నాథ్ ప్రశ్నించారు. రాష్ట్రంలో మహిళలపై అవ్యాజమైన ప్రేమాభిమానాలు కురిపిస్తున్న పవన్ కళ్యాణ్ సినిమా రంగంలో ఒక మహిళ గురించి ఒక యాంకర్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై పవన్ కళ్యాణ్ ఎందుకు మాట్లాడలేకపోయారు ? అని ప్రశ్నించారు.
గంటా శ్రీనివాసరావు క్యాబినెట్ మంత్రిగా ఉన్నప్పుడు విశాఖలో పెద్ద ఎత్తున గంజాయి చలామణి అవుతోందని ప్రకటించినప్పుడు, అయ్యన్నపాత్రుడు విశాఖలో పెద్ద ఎత్తున భూ కుంభకోణం జరుగుతోందని చెప్పినప్పుడు పవన్ కళ్యాణ్ ఎందుకు నోరు మెదపలేకపోయారని ఆయన ప్రశ్నించారు. గతంలో విశాఖ ఎంపీగా పోటీ చేసిన వ్యక్తి 1000 కోట్ల రూపాయల విలువైన భూములను ఆక్రమించుకున్నప్పుడు పవన్ ఎందుకు మాట్లాడలేకపోయారని అమర్నాథ్ ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ మాట్లాడినప్పుడల్లా ఈ రాష్ట్రం సంగతులు కేంద్రానికి చెప్తానని అంటూ ఉంటారు. మేము ఏం తప్పు చేశామని భయపడాలి. కేంద్రానికే కాదు.. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కు, రష్యా అధ్యక్షుడు పుతిన్ కూడా చెప్పుకోమని, పిల్ల బచ్చాలను చూసి భయపడే వ్యక్తి జగన్ కాదని పవన్ కళ్యాణ్ పై మంత్రి అమర్నాథ్ సెటైర్లు విసిరారు.
పవన్ కు కేంద్రం వద్ద అంత పలుకుబడి ఉంటే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ వరం కాకుండా చూడాలని అమర్నాథ్ సూచించారు. రెండు లక్షల 25 వేల కోట్ల రూపాయల సంక్షేమ పథకాలను ప్రజలకు అందిస్తున్న జగన్మోహన్ రెడ్డిని చూసి నేర్చుకోవాల్సింది పోయి అతనిపై విమర్శలు చేయడం తగదన్నారు. పది రోజుల పాటు విశాఖ జిల్లాలో ఉంటున్న పవన్ కళ్యాణ్ రాష్ట్ర ప్రభుత్వంపై అనుచిత వ్యాఖ్యలు, ఉచిత సలహాలు ఇవ్వడం మానుకొని మీ పార్టీ వ్యవహారాలు ఏం ఉన్నాయో వాటి గురించి మాట్లాడుకుని తిరిగి వెళ్ళిపోతే మంచిదని మంత్రి అమర్నాథ్ హితవు పలికారు.