ఆంధప్రభ స్మార్ట్ – అమరావతి -రక్షాబంధన్ సందర్భంగా మహిళాలోకానికి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు. అన్నా చెల్లెళ్ళు, అక్కా తమ్ముళ్ల అనురాగానికి ప్రతీక రక్షాబంధన్ పండుగ అని అన్నారు. కుటుంబ బాంధవ్యాలకు అధిక ప్రాధాన్యమిచ్చే మన భారతీయులకు శ్రావణ పౌర్ణమినాడు వచ్చే ఈ రాఖీ పండుగ ఒక ఆనందాల వేడుక అని వెల్లడించారు. ఈ పర్వదినం సందర్భంగా అక్కాచెల్లెళ్లు అందరికీ రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పవన్ కల్యాణ్ ఓ ప్రకటన విడుదల చేశారు.
అనురాగానికి ప్రతీక..
‘‘సోదర సోదరి ప్రేమ అనుభవైక్యంతోనే అర్థమవుతుంది. అక్కచెల్లమ్మల అనురాగానికి ఏమిస్తే రుణం తీరుతుంది. విప్లవ కవి శ్రీగద్దరన్న పాడినట్లు చెల్లెలు పాదం మీద పుట్టుమచ్చగానో.. అక్క నుదుటున తిలకంగానో అలంకృతమైనప్పుడే ఆ రుణం తీరుతుందేమో..! అదేవిధంగా అన్నదమ్ముల ఆప్యాయతకు ఎవరు వెలకట్టగలరు..? వీరిని జీవితాంతం గుండెల్లో గుడికట్టి పూజించడం తప్ప..! అటువంటి అనురాగానికి ప్రతీకైన రక్షాబంధన్ పండుగ శుభతరుణాన సోదర సోదరీమణులందరికీ అనురాగపూర్వక శుభాకాంక్షలు. భారతీయ సంస్కృతితో భాగమైన ఈ వేడుకను శ్రావణ పౌర్ణమినాడు ప్రేమైక మనస్సులతో భారతీయులతో పాటు దక్షిణ, తూర్పు ఆసియా దేశాలలో వైభవంగా జరుపుకునే ఈ పండుగ చేసుకోవడం సోదర సోదరీమణుల అనురాగానికి ప్రతీక. ఈ శ్రావణ పౌర్ణమి దేశవాసులందరికీ శుభాలు కలుగజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరోసారి రక్షాబంధన్ శుభాకాంక్షలు’’ అని పవన్ కల్యాణ్‌వెల్లడించారు.