మూడు రోజులుగా తిరుమల శ్రీవారి ఆలయంలో వైభవోపేతంగా సాగిన శ్రీవారి వార్షిక పవిత్రోత్సవాలు ఇవ్వాల (బుధవారం) జరిగిన పూర్ణహూతి కార్యక్రమంతో ముగిశాయి. పవిత్రోత్సవాల ముగింపుతో శ్రీవారి ఆలయంలో జరిగే ఆర్జిత సేవలను టీటీడి రేపటి నుంచి పునరుద్ధరించనున్నది. ఇక.. వైష్ణవ సాంప్రదాయం ప్రకారం జాతశౌచం, మృతశౌచం వంటి సమయాల్లో తెలిసో తెలియకో భక్తులు, సిబ్బందిచే కలిగే దోషాల వలన ఆలయం పవిత్రతకు ఎటువంటి భంగం వాటిల్లకుండా ఉండేందుకే మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలు నిర్వహించారు.
కాగా, మొదటి రెండు రోజులు ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజన కార్యక్రమం నిర్వహించడంతో పాటు శ్రీవారికి, అనుబంధ ఆలయాల్లో పవిత్రాలు సమర్పించిన అర్చకులు ఇవ్వాల (బుధవారం) శ్రీవారి ఆలయంతో పాటు వివిధ అనుబంధ ఆలయాల్లో దేవేరులకు సమర్పించిన పవిత్రాలను తొలగించి అనంతరం శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజన కార్యక్రమం నిర్వహించారు. పూర్ణాహూతి ఇవ్వడంతో పవిత్రోత్సవాలు పరిసమాప్తమయ్యాయి. పవిత్రోత్సవాల ముగింపుతో కళ్యాణోత్సవం, ఊంజులసేవ, డోలోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహాస్రదీపాలంకరణ సేవలను టీటీడి రేపటి నుంచి పునరుద్ధరించింది.