Thursday, November 21, 2024

AP: కృష్ణా-గోదావరి నదుల సంగమం… మంత్రి నిమ్మల జలహారతి

ఇబ్రహీంపట్నం పవిత్ర సంగమంలో గోదావరి జలాలకు హారతి ఇచ్చిన మంత్రి, ఎంపీ
(ప్రభ న్యూస్, ఇబ్రహీంపట్నం) : ముఖ్యమంత్రి చంద్రబాబు దీక్షాదక్షతకు, పట్టుదలకు చిహ్నమే పట్టిసీమ ప్రాజెక్టు అని జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం పవిత్ర సంగమంలో పట్టిసీమ నుంచి వస్తున్న గోదావరి జలాలకు సోమవారం ఆయన విజయవాడ పార్లమెంటు సభ్యుడు కేశినేని శివనాద్ తో కలిసి హారతి ఇచ్చి శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… కృష్ణా డెల్టా దిగువ భాగాన ప్రజలు, రైతులకు అవసరమైన తాగు, సాగునీటి కష్టాలు తీర్చడానికి చంద్రబాబు కష్టానికి ఫలితమే కృష్ణా, గోదావరి పవిత్ర సంగమం అని చెప్పారు. పట్టిసీమను వట్టిసీమ అని విమర్శించిన మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. పంటల సంగతి దేవుడెరుగు కనీసం తాగటానికి నీళ్లివ్వండని మొరపెట్టుకున్నా.. గత ప్రభుత్వం కనికరించలేదని విమర్శించారు. రాబోయే రోజుల్లో తాగు, సాగు నీటిని అందించడం ద్వారా ప్రజలు, రైతుల కష్టాలను తీరుస్తామని భరోసా ఇచ్చారు.

ప్రతి సంవత్సరం సముద్రంలో వృథాగా కలుస్తున్న మూడు వేల టీఎంసీల నీటిని సద్వినియోగం చేసుకునే అవకాశాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు సఫలీకృతం చేశారని తెలిపారు. భారతదేశంలోనే రెండు నదులను ఏకం చేసిన నాయకుడు చంద్రబాబు అని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, తెదేపా నేతలు ఎమ్మెస్ బేగ్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement