అమరావతి, ఆంధ్రప్రభ: రాష్ట్రవ్యాప్తంగా అసైన్డ్ తేనెతుట్టె కదులుతోంది.. అసైన్డ్ భూము ల అన్యాక్రాంతం.. తిరిగి వాటిని స్వాధీన పరచుకునేందుకు అవసరమైన కార్యాచరణ.. నిరుపేద దళిత అనుభవదారు లకు హక్కులు.. క్రయ.. విక్రయాలు.. భూ వినియోగ మార్పిడి.. రికార్డుల నిర్వహణ తదితర అంశాలపై మంత్రులు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులతో ఏర్పాటయిన సబ్ కమిటీ వివిధ రాష్ట్రాల్లో ఆధ్యయనం చేసిన అనంతరం పలు ప్రతిపాద నలతో ముఖ్యమంత్రికి నివేదిక సమర్పించింది. నివేదికను పరిశీలించిన ప్రభుత్వం అసైన్డు హక్కులు కల్పిస్తూ చట్ట సవరణలు చేయాలా? ఆర్డినెన్స్ తీసుకు రావాలా? జీవోల ద్వారా మార్గదర్శకాలు జారీ చేయాలా అనే అంశాల ను నిశితంగా పరిశీలన జరుపుతోంది. దీనిపై వచ్చే నెల్లో తుది నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచా రం.
రాష్ట్రంలో అసైన్డ్ భూముల బదిలీపై నిషేధం అమల్లో ఉంది. హక్కుదార్లకు భూము ల బదిలీకి సంబంధించి జీవితకాలపు నిషేధం ఉన్నందున నిరుపేద దళిత వర్గాలకు కేటాయించిన అసైన్డ్ భూముల వల్ల ప్రయోజనాలు పొందలేకపోతున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. అసైన్డ్ భూముల బదిలీ నిషేధపు చట్టం 1977 సెక్షన్ 3,5 ప్రకారం రిజిస్ట్రేషన్లకు వీలులేదు. అసైన్డు భూముల హక్కుల బదలాయింపునకు సంబంధించి మంత్రులు ధర్మాన ప్రసాదరావు, ఆదిమూలపు సురేష్, మేరుగ నాగార్జున, పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, భూపరిపాలన ప్రధాన కమిషనర్‌తో పాటు పలువురు ఉన్నతాధికారులతో కూడిన సబ్ కమిటీ నాలుగు నెలల క్రితం కర్నాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో పర్యటించి సుదీర్ఘంగా ఆధ్యయనం చేసి కొన్ని సిఫార్సులను ప్రభుత్వాని కి ప్రతిపాదనలు చేసింది. రాజధాని అమరావతిలో అసైన్డ్ రైతులకు కౌలు పరిహారం డిమాండ్లు ముందుకు రావటంతో పాటు గత ప్రభుత్వ హయాంలో అసైన్డ్ భూములను కారుచౌకగా దళిత రైతుల వద్ద నుంచి కొనుగోల్‌మాల్ చేశారనే అభియోగాల పై విచారణ జరుగుతోంది. దీంతో పాటు రాష్ట్రంలో నిరుపేద వర్గాలకు ఇళ్ల స్థలాల మంజూరుకు అసైన్డ్ భూముల అన్వేషణ జరుగుతోంది. అసైన్డు భూములు పొందిన నిరుపేద దళిత రైతులు బ్యాంక్ రుణాలు, ఇతర ప్రయోజనాలకు నోచుకోక, సరైన వనరులులేక అమ్ముకునే దారిలేక ఇబ్బందులకు గురవుతున్న నేపథ్యంలో మొత్తంగా అసైన్డ్ చట్టంలో మార్పులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అసైన్డ్ భూముల క్రయ, విక్రయాలు, లీజుకు ఇవ్వటం, గిఫ్ట్ డీడ్‌గా ప్రకటించటం, మార్ట్‌గేజ్, మార్పులు, చేర్పులకు చట్ట ప్రకారం అవకాశం లేదు. పరాధీనమైన భూముల గుర్తింపు.. ప్రస్తుతం అనుభవదారులకు హక్కులు కల్పించటంలో భాగంగా సబ్ కమిటీని నియమించింది. ఇందులో భాగంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న భూముల రీ సర్వే కార్యక్రమంలో అసైన్డ్ భూములను గుర్తించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.
ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కాకుండా చూడటం, పరాధీనమైన భూములు స్వాధీన పరచుకోవటం, నిర్దిష్ట ప్రయోజనాలకు వినియోగించటంతో పాటు బదిలీల నిషేధ చట్టాలను సవరించడం ద్వారా ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసే యోచనలో ప్రభుత్వం ఉంది. కర్నాటకలో ప్రభుత్వ అసైన్డ్ పరిరక్షణకు కర్నాటక పబ్లిక్ ల్యాండ్ కార్పొరేషన్ లిమిటెడ్ అనే చట్టబద్ధ సంస్థ ఏర్పాటయింది. ఆక్రమణలకు అడ్డుకట్ట వేసి అసైన్డ్ భూముల పరిరక్షణకు కార్పొరేషన్ బాధ్యత వహిస్తుంది. రాష్ట్రంలో కూడా ఇదే తరహాలో ఏర్పాటు చేయటంతో పాటు అసైన్డ్ భూములపై హక్కులు కల్పిస్తూ పట్టా జారీ చేయటంతో పాటు రిజిస్ట్రేషన్ చేయటం ద్వారా క్రయ, విక్రయాలకు అనువుగా ఆస్తిని అనుభవించే హక్కు పేదలకు కలుగుతుందనేది ప్రభుత్వ భావన. అయితే ఈ భూములు నిరుపేద వర్గాలకు కేటాయించటం వల్ల భవిష్యత్తుకు భరోసా ఉంటుంది. సొంత అవసరాలకు వీటిని అమ్ముకుని తిరిగి భూమిలేని నిరుపేద దళిత వర్గాలుగానే మిగిలిపోతున్నారని అందువల్ల క్రయ, విక్రయాలపై కొన్ని నిబంధనలు విధించే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. అసైన్డ్‌కు సంబంధించి వచ్చేనెల్లో ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకుని వచ్చే కేబినెట్ సమావేశంలో ఆమోదించనున్నట్లు సమాచారం.