- మరింత వేగవంతంగా పాస్ పార్ట్ జారీ..
- ఏపీలో 13 కేంద్రాల ద్వారా సమర్థవంతమైన సేవలు…
- గత ఏడాది మూడున్నర లక్షల పాస్పోర్టు సేవలు..
- పోలీస్, పోస్టల్ శాఖల సమన్వయంతో….
- పౌరుల ఇంటి వద్దకే పాస్పోర్ట్ డెలివరీ…
- జనవరిలో ప్రత్యేక డ్రైవ్….
- రీజనల్ పాస్ పోర్ట్ ఆఫీసర్ శివ హర్ష…
(ఆంధ్రప్రభ, ఎన్టీఆర్ బ్యూరో) : మారుతున్న పరిస్థితులు, అందిపుచ్చుకుంటున్న సాంకేతిక పరిజ్ఞానం, పోలీస్, పోస్టల్ శాఖ అధికారుల సమిష్టి సమన్వయంతో సమర్థవంతంగా పాస్ పోర్ట్ సేవలను అందిస్తున్నట్లు రీజినల్ పాస్ పోర్ట్ ఆఫీసర్ శివ హర్ష తెలిపారు. పాస్ పోర్ట్ కోసం దళారులను ఆశ్రయించవద్దన్న ఆయన నేరుగా కార్యాలయాన్ని కానీ, ఆన్ లైన్ లో లభిస్తున్న సేవలను వినియోగించుకోవాలన్నారు. విజయవాడలోని ప్రాంతీయ పాస్ పోర్ట్ సేవా కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ… గత ఏడాది రీజనల్ పాస్ పోర్ట్ కార్యాలయం ఒక మైలురాయిని అధిగమించిందన్నారు.
సేవలను పౌర అనుబంధాన్ని విజయవంతంగా మెరుగు పరుచుకుని గత ఏడాది 23,23,553 పాస్ పోర్ట్ లకు సంబంధించిన సేవలను అందించామన్నారు. విజయవాడ, తిరుపతిలో రెండు పాస్ పోర్ట్ సేవా కేంద్రాలు, దాని అధికార పరిధిలోనికి వచ్చే 13 పోస్ట్ ఆఫీస్ పాస్ పోర్ట్ సేవా కేంద్రాల ద్వారా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు సమర్థవంతంగా సేవలు అందించగలిగామన్నారు. విజయవాడలోని ప్రాంతీయ పాస్ పోర్ట్ కార్యాలయంలో అత్యాధునిక పరిపాలన పాలసీ ప్రింటింగ్ వంటి మౌలిక సదుపాయాలు కల్పించడం ద్వారా త్వరితగతిన పాస్ పోర్ట్ లను మంజూరు చేస్తే అవకాశం కలిగిందన్నారు. 2023-24 సంవత్సరానికి సంబంధించి అత్యుత్తమమైన సేవ ప్రమాణాలు అందించినందుకు దాని విభాగంలో ఉత్తమ కార్యాలయంగా అవార్డు కూడా పొందినట్లు గుర్తు చేశారు. విజయవాడ పాస్ పోర్ట్ సేవా కేంద్ర విస్తరణ పనులు తుది దశకు చేరుకున్నాయని త్వరలోనే పూర్తిస్థాయిలో ఈ కార్యాలయం సకల సౌకర్యాలతో అందుబాటులోకి రావడంతో పాటు మెరుగైన సేవలు అందిస్తామన్నారు.
సమర్థవంతంగా సేవలందించడంలో ఏపీ పోలీస్ పోస్టల్ డిపార్ట్ మెంట్ టాటా కన్సల్టెన్సీ ఎనలేని సహకారం అందిస్తున్నారని వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. పౌరులు తమ పాస్ పోర్ట్ ను సకాలంలో పొందేందుకు వీలుగా పాస్ పోర్ట్ దరఖాస్తుల కోసం అత్యుత్తమ వేగవంతమైన పోలీసు ధ్రువీకరణ ప్రక్రియలు ఏపీ పోలీస్ ఒకటి అని పేర్కొన్నారు. పోస్ట్ ఆఫీస్ పాస్ పోర్ట్ సేవా కేంద్రాల వద్ద అదనపు అపాయింట్ మెంట్లను సులభతరం చేయడం ద్వారా పౌరుల ఇంటి వద్దకే పాస్పోర్టులను వేగంగా డెలివరీ చేయడం సాధ్యపడుతుందన్నారు. సహకరిస్తున్న పోస్టల్ డిపార్ట్మెంట్ కి ఆయన పూర్తి మద్దతును ధన్యవాదాలు ప్రశంసలను తెలిపారు.
విజయవాడ కేంద్రంలో జనవరి నెలలోని ప్రతి బుధవారం ప్రత్యేక డ్రైవ్ లను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. వినియోగదారుల అవసరాలు దరఖాస్తులకు అనుగుణంగా సేవలను మరింత సులభతరం చేయడానికి 250 అదనపు అపాయింట్ మెంట్లను అందిస్తున్నామన్నారు. అలాగే పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్ కోసం పోస్టల్ సేవా సిబ్బంది కోసం ప్రత్యేకంగా అదనంగా నియమించినట్లు తెలిపారు. పాస్ పోర్ట్ సేవల కోసం ఏజెంట్లను ఉపయోగించకుండా అధికారిక వెబ్సైట్లో దరఖాస్తు చేసుకునే అపాయింట్ మెంట్లను ఖరారు చేసుకోవచ్చన్నారు. అలాగే తేదీలను మార్చుకునే సౌకర్యం కూడా సులభతరం చేశామన్నారు. సేవల్లో మణింత రాణించేలా పౌరులకు నిబద్దతతో సేవలు అందించేందుకు కృషి చేస్తున్నట్లు ఆయన చెప్పారు.