జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ పార్వతీపురం పట్టణంపై దృష్టి సారించారు. జిల్లా కేంద్రం కొన్ని అంశాలలో ప్రత్యేకతతో ఉండాలని భావించారు. పారిశుధ్యం మెరుగు కావాలని, మురుగు నీటి కాలువల ప్రవాహం బాగుండాలని, ప్లాస్టిక్ రహితంగా ఉంటూ పరిశుభ్ర పట్టణంగా నిలవాలని ఆకాంక్షిస్తున్నారు. పట్టణంలో పశువులు, పందులు ఇష్టానుసారంగా సంచరించకుండా సుందర పట్టణంగా చేయాలని భావిస్తున్నారు. మదిలో మెదిలిన వెంటనే సోమవారం తెల్లవారక ముందే సైకిల్ ఎక్కారు. ఆకస్మింగా పట్టణాన్ని చుట్టారు జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్. పట్టణం నడి బొడ్డు నుండి పట్టణం పొలిమేరల వరకు తనిఖీలు నిర్వహించారు. పారిశుధ్యం, ప్లాస్టిక్ వినియోగం, మురుగు నీటి కాలువలు, మురుగు నీటి నిర్వహణ, రహదారుల పరిశుభ్రత, రహదారి డివైడర్లు, జాతీయ నాయకుల విగ్రహాలు, తాగు నీటి సరఫరా, క్రీడా మైదానం తదితర విషయాలను క్షుణ్ణంగా పరిశీలించారు. స్వామి వివేకానంద విగ్రహాన్ని స్వయంగా శుభ్రం చేసి జాతీయ నాయకులను గౌరవించు కోవాలని చెప్పకనే చెప్పారు.
పట్టణం పరిశుభ్రంగా ఉంచాలని, పారిశుధ్య నిర్వహణలో లోపం ఉండరాదని మునిసిపల్ కమీషనర్ సింహాచలంను ఆదేశించారు. వరహాలు గెడ్డలో పూడికలు తీయాలని ఆదేశించారు. రానున్న వర్షాకాలం దృష్ట్యా కాలువల్లో నీరు నిలువ కుండా నిర్వహణ పనులు చేపట్టాలని ఆదేశించారు. రహదారి డివైడర్లకు రంగులు వేయాలని, రహదారులను శుభ్రంగా ఉంచాలని, పశువులు, పందులు రహదారులపై ఉండకుండా చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. పశువుల యజమానులకు అవగాహన కల్పించాలని, అప్పటికి నియంత్రణ లేకపోతే గోశాల వంటి ప్రదేశంలో ఉంచాలని ఆయన అన్నారు. దుకాణదారులు చెత్తను రహదారిపైకి వేయరాదని, డస్ట్ బిన్ లను పెట్టు కోవాలని ఆయన స్పష్టం చేశారు. పట్టణ కేంద్రంలో మంచి వాకింగ్ ట్రాక్ ఉండాలని సూచించారు. అందుకు ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఉన్న ట్రాక్ కు మరిన్ని హంగులు చేకూర్చి మెరుగు పరచాలని అన్నారు. రహదారులపై గుంతలు పూడ్చాలని ఆయన ఆదేశించారు. జాతీయ నాయకుల విగ్రహాలను గౌరవించడం మన బాధ్యత అని పేర్కొంటూ ఉన్న విగ్రహాలను శుభ్రం చేయాలని ఆయన ఆదేశించారు.
పార్వతీపురం పట్టణం సుందర పురంగా తయారు కావాలని ఆకాక్షిస్తున్నట్లు మీడియాతో మాట్లాడుతూ కలెక్టర్ నిశాంత్ తెలిపారు. ఇప్పటి వరకూ డివిజన్, మునిసిపాలిటీ కేంద్రంగా మాత్రమే ఉందని ప్రస్తుతం స్థాయి పెరిగి జిల్లా కేంద్రంగా ఆవిర్భవించిందని ఆయన పేర్కొన్నారు. జిల్లా కేంద్రానికి ఉండాల్సిన హంగులు క్రమంగా ఏర్పాటుకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.