Sunday, November 24, 2024

AP | పార్టీ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలి.. స్ట్రాంగ్‌రూమ్స్‌ వద్ద పహారా అవసరం : నాగబాబు

అమరావతి, ఆంధ్రప్రభ : సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్‌ ప్రక్రియ ముగిసేంతవరకు కూటమి పార్టీ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. నాగబాబు సూచించారు. రాష్ట్రంలో ప్రస్తుతం జరిగిన ఎన్నికల్లో 82 శాతం మేర ఓట్లు పోలవడం ప్రజాస్వామ్య విజయమని ఎన్నికల ప్రక్రియ ఇంకా ముగియలేదని కౌంటింగ్‌ కూడా ఉందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు.

ఓటమి భయంలో ఉన్న వైసీపీ, అనుచరగణాలు ఎంతటి అరాచకానికైనా ఒడిగట్టే అవకాశాలు ఉన్నాయని దీనికి నిదర్శనం పల్నాడు, తాడిపత్రి, తిరుపతి ఘటనలేనని వ్యాఖ్యానించారు. శనివారం మీడియాకు విడుదల చేసిన ఒక వీడియోలో మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి అనుచర వర్గం ఇళ్లల్లో పెట్రోల్‌ బాంబులు దొరి కాయని దీన్ని బట్టి ఏ స్థాయిలో ప్రమాదం ఉందో ప్రజలు, పార్టీ శ్రేణులు గమనించాలని సూచించారు.

తాడిపత్రిలో పోలీసులు తమను తాము రక్షించుకోవడానికే అగచాట్లు పడ్డారని దీంతో వైసీపీ ఏ విధంగా రెచ్చిపోతుందో అర్థం చేసుకోవాలన్నారు. విశాఖ కంచరపాలెం ఘటన దుర్మార్గమని మహిళలపై ఏ స్థాయిలో దాడి చేశారోనని అందరికీ తెలుసని చెప్పారు. ఈ నేపథ్యంలో ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్‌రూమ్స్‌ వద్ద భద్రత కట్టుదిట్టంగా ఉండాలని కేంద్ర ఎన్నికల సంఘం నాలుగంచెల భద్రతా ఏర్పాట్లు చేసినప్పటికీ కూటమి శ్రేణులు నిరంతరం పహారా ఉండాలని కోరారు.

స్ట్రాంగ్‌రూమ్స్‌ వద్ద కాపలా కేసే అవకాశాన్ని కూడా ఎన్నికల కమిషన్‌ ఇచ్చిందని దీన్ని తేలిగ్గా తీసుకోకుండా అందరూ జాగ్రత్తగా వ్యవహరించాలని కోరారు. సీఎం జగన్‌కు డొనాల్డ్‌ ట్రంప్‌ లక్షణాలు వచ్చాయని.. ఓటమి అర్థమవుతున్నా ట్రంప్‌ లాగా నేనే గెలుస్తానంటూ ప్రచారం మొదలుపెట్టారంటూ విమర్శించారు.

ఓటమి అనంతరం కూడా జగన్‌ కుర్చీ వదిలిపెట్టరని ట్రంప్‌ లాగా బయటకు పంపే పరిస్థితి వస్తుందని వ్యాఖ్యానించారు. ఎన్నికల హింసపై కేంద్రానికి కచ్ఛితమైన సమాచారం ఉందని అందుకే అదనపు బలగాలను మొహరించాని చెప్పారు. అరాచక పాలనకు ముగింపు రానుందని, అభివృద్ధి సాధకుల చేతుల్లోకి అధికారం వచ్చే సమయం దగ్గరలో ఉందని నాగబాబు అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement