ఒంగోలు, ప్రభన్యూస్ : దొంగతనానికి వచ్చే వారు తాళం వేసిన ఇళ్లనే లక్ష్యంగా చేసుకుంటారు. ఊరెళ్లిన వారి గృహాలనే ఎంచుకుంటారు. కానీ ఈ కిరాతకులు అలా కాదు. వీళ్లు దోపిడీకి రావాలంటే కచ్చితంగా ఆ ఇంట్లో జనాలు ఉండాల్సిందే ! అత్యంత కిరాత ఈ దోపిడీ ముఠా.. ఇంట్లో వాళ్లను భయ బ్రాంతులకు గురి చేస్తూ.. అతి క్రూరంగా వ్యవహరిస్తారు…ఇంట్లోకి చొరబడి..ఇంట్లో వారిని కొట్టి, కొని ్న సందర్భాల్లో ఇంట్లో వారి పై అత్యాచారం చేసి..మరీ దోపిడీకి పాల్పడే మహారాష్ట్రకు చెందిన పార్థీ గ్యాంగ్ ! ఈ ఖతార్నాక్ ముఠా పేరు చెబితేనే జనం వెన్నులో వణుకు పుడుతోంది. జిల్లాలో రెండు చోట్ల జరిగిన దారుణ జంట హత్యలు ఈ ముఠా పనేనని పోలీసులు నిర్థారణకు వచ్చినట్లు సమాచారం. దీంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. వీరి దోపిడీ తీరు తీవ్ర భయాందోళనలు కలిగిస్తోంది. కిరాతకంగా గొంతు కోసి హత్య చేయడం, ఒంటి పైన ఉన్న బంగారం దోచుకుపోవడం పార్థీ గ్యాంగ్ ప్రత్యేకత!
టంగుటూరులో పోలీసు స్టేషన్‌కు కూతవేటు దూరంలో తల్లీ, కూతుర్లను అత్యంత కిరాతకంగా హత్య చేయడంతో పాటు, ఇటీవల ఇంకొల్లు మండలం పూసపాడుల్లో వృద్దులను హత్య చేసినట్లు పోలీసులు ఒక ప్రాథమిక అంచనాకు వచ్చారు. దోపిడీలు, దొంగతనాలు, హత్యలు చేయడంలో కరుడుగట్టిన నేరస్తులుగా ఆరితేరిన ఈ ముఠా మహారాష్ట్ర, కర్నాటక రాష్ట్రాల్లో హల్‌చల్ చేసి.. ఇప్పుడు జిల్లాలో జరిగిన జంట హత్యల్లో పాల్గొనట్లు తెలుస్తోంది. అయితే టంగుటూరు లోని తల్లీ, కూతురు హత్యలు, ఇంకొల్లు మండలం పూసపాడులో వృద్దుల హత్యల తీరు ఒకే విధంగా ఉండటం, రెండు చోట్ల కూడా ఒకటే సెల్‌ఫోన్ నెంబర్‌ను వినియోగించడం, అదే సమయంలో రెండు చోట్ల నుంచి కర్రల లారీ సోలాపురం వెళ్లడం వంటి సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా దోపిడీ దొంగలను గుర్తించి, సోలాపూర్ పోలీసులకు సమాచారం అందించడంతో ఈ ముఠాను వలపన్ని పట్టుకుని, మన పోలీసులకు అప్పగించారు.
టంగుటూరులో జరిగి తల్లీ, కూతుర్ల హత్యల వ్యవహారం పై జిల్లా ఎస్పీ తీవ్రంగా స్పందించారు. సంఘటనా స్థలానికి వెళ్లి బాధితులను పరామర్శించడమే కాకుండా జరిగిన నేరానికి సంబంధించి పరిశోధన చేశారు. క్లూస్‌టీం, డాగ్ స్క్వాడ్‌తో తనిఖీ చేయించారు. ఇదిలా ఉండగా పాత నేరస్తులు, ఇటువంటి దొంగతనాలకు పాల్పడే వారి పై నిఘాపెట్టారు. జిల్లా వ్యాప్తంగా అనుమానితుల గురించి ఆరా తీశారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital