Friday, November 22, 2024

ఏపీ ప్రగతిపై విభజన ప‌ర్యావ‌సానాలు.. ప్రధాని వద్ద సీఎం జగన్ ఆవేదన

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన కీలక అంశాలు, నిధులు, పెండింగ్ సమస్యలు, విభజన హామీల అమలే లక్ష్యంగా తొలిరోజు ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ఢిల్లీ పర్యటన సాగింది. ఇటీవలి శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో రాష్ట్ర ప్రభుత్వం అనేక అంశాలను కేంద్రం ముందుంచింది. నిన్న మధ్యాహ్నం ఢిల్లీ చేరుకున్న జగన్ సాయంత్రం 4 గంటల సమయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సుమారు గంటసేపు ఆయన నివాసంలో భేటీ అయ్యారు. 6 గంటల సమయంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, అనంతరం 7.45 ని.లకు పౌర విమానయాన శాఖా మంత్రి జ్యోతిరాదిత్య సింధియాతో భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై వారితో చర్చించారు. వివిధ ప్రాజెక్టులకు నిధులు, జలవివాదాలు, రాజధానుల అంశం, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని వారి ముందుంచారు. వినతి పత్రాలు సమర్పించారు.

ప్రధానమంత్రితో భేటీలో రాష్ట్ర విభజన పర్యవసానాలు ఆర్థిక ప్రగతిని తీవ్రంగా దెబ్బ తీశాయని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర విభజన సమయంలో 58 శాతం జనాభా ఏపీకి రాగా… కేవలం 45 శాతం మాత్రమే రెవెన్యూ మాత్రమే దక్కిందని చెప్పారు. 2015–16లో తెలంగాణ రాష్ట్ర తలసరి ఆదాయం రూ.15,454 కాగా… ఏపీ తలసరి ఆదాయం రూ.8,979 మాత్రమేనని వివరించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉన్నదో చెప్పడానికి ఈ గణాంకాలే నిదర్శనమన్నారు. ప్రజల అవసరాలను తీర్చాలంటే, వారికి సరైన సేవలు అందించాలంటే అంతే స్థాయిలో వ్యయం కూడా చేయాల్సి ఉంటుందని చెప్పారు.

విభజన వల్ల రాజధానిని, దానికి సంబంధించిన మౌలిక సదుపాయాలను కోల్పోయామని, కొత్త రాజధానుల కోసం భారీగా ఖర్చు చేయాల్సి వచ్చిందని సీఎం… ప్రధాని మోదీకి వివరించారు. రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన ప్రత్యేక హోదా హామీతో పాటు ఇతర హామీలను అమలు చేయాని ఆయన అభ్యర్థించారు. నిర్మలా సీతారామన్‌తో భేటీలో రాష్ట్ర ఆర్థికాంశాలు, పెండింగ్ నిధులు, బకాయిల గురించి, జ్యోతిరాదిత్య సింధియాతో సమావేశంలో రాష్ట్రంలో కొత్త విమానాశ్రయాల అభివృద్ది, కార్గో టెర్మినళ్ల నిర్మాణం వంటి తదితర అంశాలపై జగన్మోహన్ రెడ్డి చర్చించారు. సీఎం జగన్ ప్రధానమంత్రి మోదీ, కేంద్ర మంత్రులకు సమర్పించిన వినతిపత్రాల్లోని ప్రధానాంశాలు…

పెరిగిన వ్యయానికి తగ్గట్టు పోలవరానికి నిధులు
2014 అంచనాల మేరకే పోలవరం ప్రాజెక్టుకు నిధులిస్తామని 2016లో చెప్పిన కేంద్ర ఆర్థిక శాఖ ఆ తర్వాత పెరిగిన ప్రాజెక్టు వ్యయాన్ని పరిగణనలోకి తీసుకోలేదని చెప్పారు. ఇరిగేషన్‌ కాంపొనెంట్‌ రూపంలో చేసిన ఖర్చులనూ మినహాయించడం వల్ల పెరిగిన ప్రాజెక్టు అంచనాల భారమంతా రాష్ట్ర ప్రభుత్వం మీదే పడుతోందని, ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టంలో సెక్షన్‌–90 స్ఫూర్తికి ఇది పూర్తిగా విరుద్ధమని చెప్పారు. పోలవరం నిర్మాణం ప్రారంభమై ఏళ్లు గడుస్తుండడంతో వ్యయం కూడా పెరుగుతోందని, ప్రాజెక్టు ఖర్చులో అధిక భాగం 2013 నాటి భూసేకరణ చట్టం అమలుకే వ్యయం చేయాయని, చట్టం ప్రకారం ముంపు ప్రాంతాల నుంచి తరలించాల్సిన కుటుంబాలకు ప్యాకేజీలను కూడా పెంచడం, ఇవన్నీరాష్ట్ర ప్రభుత్వంపై తీవ్రం భారంగా పరిణమించాయని ఆవేదన వ్యక్తం చేశారు.

ఏ నీటి ప్రాజెక్టులోనైనా రెండు ఇరిగేష్, విద్యుదుత్పత్తి అని రెండు భాగాలు ఉంటాయని లేఖలో పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టులో కేవలం ఇరిగేషన్‌ భాగానికి మాత్రమే మాత్రమే నిధులిస్తామని కేంద్రం చెబుతోందన్నారు. ఈ అంశాల్లో జోక్యం చేసుకుని తగిన ఆదేశాలివ్వాలని, 2017–18 ధరల సూచీ ప్రకారం పోలవరం అంచనా వ్యయాన్ని రూ.55,657 కోట్లుగా నిర్ణయించాలని జగన్ కోరారు. అంతే కాకుండా పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించిన రూ.2100 కోట్ల పెండింగ్‌ బిల్లులను మంజూరు చేసేలా ఆర్థిక శాఖకు ఆదేశాలు ఇవ్వాలని ప్రధానికి విజ్ఞప్తి చేశారు.

- Advertisement -

రెవెన్యూ లోటును చెల్లించండి
అవశేష ఆంధ్రప్రదేశ్‌కు రెవిన్యూ లోటును పూడుస్తామంటూ అప్పటి ప్రధానమంత్రి ఫిబ్రవరి 20, 2014న రాజ్యసభలో చేసిన ప్రకటనను ఈ సందర్భంగా సీఎం గుర్తు చేశారు. 2014 జూన్‌ నుంచి మార్చి 31, 2015 వరకూ ఉన్న రీసోర్స్‌ గ్యాప్‌ మొత్తం రూ.16,078.76 కోట్లని కాగ్‌ నిర్ధారించిందని, ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం ప్రామాణిక వ్యయం (స్టాండరై్డజ్డ్‌ ఎక్స్‌పెండేచర్‌) పేరిట కొత్త పద్ధతిని తీసుకొచ్చిందని చెప్పారు. రీసోర్స్‌ గ్యాప్‌ను కేవలం రూ.4,117.89 కోట్లకు పరిమితం చేయండంతో నిధుల కొరత వల్ల 2014–15 ఆర్థిక సంవత్సరంలో చాలా బిల్లులను, పీఆర్సీ బకాయిలను రాష్ట్ర ప్రభుత్వం చెల్లించలేకపోయిందని తెలిపారు. 2014–15లో చెల్లించాల్సిన బిల్లులను, ఇతర బకాయిలను పరిగణనలోకి తీసుకుంటే రెవెన్యూ లోటు రూ.22,948.76 కోట్లకు చేరగా… రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం ఇచ్చింది కేవలం రూ.4,117.89 కోట్లు మాత్రమేనని ముఖ్యమంత్రి వెల్లడించారు. చాలా కాలంగా పెండింగులో ఉన్న మిగిలిన రూ.18,830.87 కోట్లు చెల్లించి రాష్ట్రానికి అండగా నిలవాలని కోరారు.

చెల్లింపులతో సాయం-విద్యుత్ సంస్థలకు బలం
రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు 2014 నుంచి 2017 వరకు తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థలకు ఏపీ జెన్‌కో విద్యుత్‌ను సరఫరా చేసిందని, దీని కోసం రూ.6,284 కోట్లను చెల్లించాల్సి ఉందని సీఎం చెప్పుకొచ్చారు. ఈ విషయాన్ని తెలంగాణ డిస్కంలు కూడా గుర్తించినా ఇప్పటివరూ ఎలాంటి చెల్లింపులు చేయలేదని ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. ఆర్థిక అవసరాలను తీర్చుకోవడానికి ఏపీ విద్యుత్‌ సంస్థలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నాయని, ఈ బిల్లులను చెల్లించేలా తగిన ఆదేశాలివ్వాల్సిందిగా జగన్ వినతి పత్రంలో పేర్కొన్నారు.

జాతీయ ఆహార భద్రత సాయం పెంచండి
జాతీయ ఆహార భద్రతా చట్టం కింద అర్హత ఉన్న చాలా మందికి సాయమందడం లేదని, అదనంగా 56 లక్షల మందికి రాష్ట్ర ప్రభుత్వమే పీడీఎస్‌ ద్వారా సేవలందిస్తున్నట్టు ముఖ్యమంత్రి వివరించారు. దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వంపై భారం పడుతోందని, దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న వారిపై సమగ్ర పరిశీలన జరిపి ఎక్కువ మంది లబ్ధిదారులు సాయమందేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. జాతీయ ఆహార భద్రతా చట్టం కింద సేకరిస్తున్న ఆహార ధాన్యాల్లో కేవలం 90శాతం మాత్రమే కేటాయిస్తున్నారని గుర్తు చేశారు. 2021 ఆగస్టులో సేకరించిన బియ్యం 24.4 లక్షల టన్నులు కాగా… 21.54 లక్షల మెట్రిక్‌ టన్నుల బియ్యాన్ని మాత్రమే పంపిణీ చేశారని తెలిపారు. ఏపీలో లబ్ధిదారులకు సేవలను విస్తృత పరిచే విధంగా జోక్యం చేసుకుని తగిన కేటాయింపులు చేయాలని ప్రధానిని కోరారు.

విపత్కర పరిస్థితుల్లో అండగా నిలబడ్డాం
కేంద్రం నుంచి రావాల్సిన పన్నుల ఆదాయం దాదాపు 3.38 శాతం తగ్గిందని, గత 2 దశాబ్దాల్లో కేంద్రం నుంచి వచ్చే పన్నుల ఆదాయంలో అతి తక్కువ నమోదైందని జగన్మోహన్ రెడ్డి తెలిపారు. కోవిడ్ కారణంగా ప్రజల ప్రాణాలు కాపాడేందుకు ప్రభుత్వాలు విపరీతంగా ఖర్చు చేయాల్సి వచ్చిందని చెప్పుకొచ్చారు. 2019–2020 ఆర్థిక మందగమనం కూడా ఏపీపై ప్రభావం చూపిందని ఆయన వాపోయారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన పన్నుల వాటా రూ.34,833 కోట్లు కాగా వాస్తవంగా వచ్చింది రూ.28,242 కోట్లు మాత్రమేనని తెలిపారు. 2020–21లో కోవిడ్‌ పరిస్థితులు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను దారుణంగా దెబ్బ తినడం వల్ల కేంద్ర పన్నుల్లో రూ.7.780 కోట్ల మేర నష్టం వాటిల్లిందని ప్రధానికి వివరించారు. రాష్ట్రం ఆదాయ వనరుల నుంచి రావాల్సిన రూ.7 వేల కోట్లు కూడా రాకుండా పోయాయని తెలిపారు.

కోవిడ్‌ నివారణా చర్యల కోసం దాదాపు రూ.8 వేల కోట్లు ఖర్చు చేశామని వెల్లడించారు. ఇంతటి విపత్కర పరిస్థితుల్లో ప్రత్యక్ష నగదు బదిలీ పథకాల (డీబీటీ) ద్వారానే జీవనోపాధి కోల్పోయిన ప్రజలను ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం భావించినట్టు నరేంద్ర మోదీకి చెప్పారు. అంతేకాకుండా ప్రజల భవిష్యత్‌ను ఉజ్వలంగా మార్చే వైద్యం, విద్య, వ్యవసాయం, గృహ నిర్మాణం తదితర రంగాల్లో వివిధ కార్యక్రమాలు, మౌలిక సదుపాయాల కల్పనా ప్రాజెక్టులు కుంటుపడకుండా అమలు చేశామని ప్రధానికి సీఎం జగన్ వివరించారు.

నిర్థారించిన మేర అప్పులు తెచ్చుకుంటాం
2021–22 కేంద్ర ప్రభుత్వం ఎఫ్‌ఆర్‌బీఎం చట్టం ప్రకారం గరిష్ట రుణ పరిమితి (నెట్‌ బారోయింగ్‌ సీలింగ్‌–ఎన్‌బీసీ) ని రూ. 42,472 కోట్లుగా నిర్ధారించిన కేంద్ర ఆర్థిక శాఖ దీన్ని రూ.17,923.24 కోట్లకు తగ్గించింది. గత ప్రభుత్వ హయాంలో చేసిన అధిక అప్పులను పరిగణనలోకి తీసుకుని ఆమేరకు నిర్దేశించిన రుణ పరిమితిని సర్దుబాటు చేసినట్టుగా పేర్కొంది. ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో తమ తప్పు లేకుండానే ఈ విధంగా రుణ పరిమితిలో కోత విధించడం సరి కాదని ముఖ్యమంత్రి ప్రధానమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. గత ఐదేళ్ల కంటే ముందు ఇచ్చిన రుణ పరిమితిలో కూడా రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా అప్పులు తీసుకోలేదనే అంశానికి సంబంధించి వివరాలను ఆయన ప్రధానికి సమర్పించారు. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకుని 2021–22 కేంద్ర ప్రభుత్వం ఎఫ్‌ఆర్‌బీఎం చట్టం ప్రకారం ఎన్‌బీసీని రూ.42,472 కోట్లుగా నిర్ధారించిన మేరకు అప్పులు తెచ్చుకునేందుకు వెసులుబాటు కల్పించాలని జగన్ కోరారు.

భోగాపురంపై దృష్టి
భోగాపురం ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టు నిర్మాణానికి సైట్‌ క్లియరెన్స్‌ అప్రూవల్‌ను రెన్యువల్‌ చేయాలని సీఎం జగన్ మోదీని అభ్యర్థించారు. వైఎస్సార్‌ కడప జిల్లాలో ఇంటిగ్రేటెడ్‌ స్టీల్‌ ప్లాంట్‌ ఏర్పాటునకు సంబంధించి మెకాన్‌ సంస్థ ద్వారా వీలైనంత త్వరగా నివేదిక వచ్చేలా చూడాలని కోరారు. ఆ ప్రాంత ప్రజల ఆకాంక్షలను తీర్చే క్రమంలో స్టీల్‌ప్లాంట్‌ ఏర్పాటు కోసం వైఎస్సార్‌ స్టీల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ను ఏపీ ప్రభుత్వం ప్రారంభించిందని చెప్పారు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వానికి చెందిన ఏపీ మినరల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌కు గనులు కేటాయించాలని కేంద్ర గనుల శాఖకు విజ్ఞప్తి చేశామని ప్రధానికి వివరించారు. కడప జిల్లాలో ప్లాంట్‌ ఏర్పాటుకు అత్యంత కీలకమైన గనుల కేటాయింపు అంశంలో జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఎయిర్‌పోర్టుకు సంబంధించిన ప్రక్రియ వీలైనంత వేగంగా పూర్తయ్యేలా చేస్తే డం ద్వారా రాయలసీమ ప్రజల చిరకాల కోరిక నెరవేరుతుందని ప్రధాని వద్ద ప్రస్తావించారు.

ప్రధానమంత్రి, ఆర్థిక మంత్రితో సమావేశం అనంతరం జగన్ కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియాను కలిశారు. దేశంలో విమానయాన రంగం అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం చూపుతున్న ప్రత్యేక చొరవ, చేస్తున్న కృషికి అభినందనలు తెలిపారు. భోగాపురంలో నిర్మిస్తున్న గ్రీన్‌ఫీల్డ్‌ అంతర్జాతీయ విమానాశ్రయం అభివృద్ధికి సహకరించాలంటూ వినతిపత్రం సమర్పించారు. విభజన తర్వాత విమానయానంతో సహా, అన్ని రంగాలలో ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధి కోసం పదేళ్ల పాటు సహకరిస్తామని 2014 రాష్ట్ర పునర్విభజన చట్టంలో నాడు కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. భౌగోళిక పరిస్థితుల దృష్ట్యా (పక్కనే తూర్పు నావికాదళం కేంద్రం ఉండడం) ప్రస్తుతం విశాఖపట్నంలో ఉన్న విమానాశ్రయం విస్తరణకు అవకాశం లేకపోవడంతో, భోగాపురం వద్ద గ్రీన్‌ఫీల్డ్‌ అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మిస్తున్నట్టు వివరించారు.

రాష్ట్రంలో అతి పెద్ద నగరం విశాఖపట్నంతో పాటు, పరిసర ప్రాంతాల అభివృద్ధిలో ఎంతో కీలకమైన ఈ ప్రాజెక్టుకు ఆర్థికంగానూ, అనుమతుల విషయంలో తోడ్పాటునందించాలని కోరారు. భోగాపురం విమానాశ్రయాన్ని నిర్ణీత మూడేళ్ల వ్యవధిలో పూర్తి చేసేలా సహాయ, సహకారాలు అందించాలని అభ్యర్థించారు. జగన్ ఎంపీగా ఉన్న సమయంలో జ్యోతిరాదిత్య యూపీఏ సర్కార్‌లో సహాయ మంత్రిగా ఉన్నారు. సమావేశం అనంతరం జగన్‌కు సింధియా డిన్నర్ ఏర్పాటు చేశారు. నేటి ఉదయం 9.30 ని.లకు రోడ్డు, రవాణా, జాతీయ రహదారుల శాఖా మంత్రి నితిన్ గడ్కరీ సహా మరికొందరు కేంద్ర మంత్రులతో ముఖ్యమంత్రి సమావేశం కానున్నారు. కీలక రాజకీయాంశాలపై చర్చించబోతున్నట్టు సమాచారం. అనంతరం ఆయన ఆంధ్రప్రదేశ్‌కు తిరిగి ప్రయాణమవుతారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement