ధర్మవరం మే 16 ప్రభ న్యూస్ – పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు ఎంతో మంది నాయకులు ఇక్కడ ధైర్యంగా నిలబడ్డారని.. అటువంటి నేతలకు ఎప్పటికీ పార్టీ మరచిపోదని ధర్మవరం నియోజకవర్గ ఇన్ ఛార్జి పరిటాల శ్రీరామ్ అన్నారు. నియోజకవర్గంలోని ముదిగుబ్బ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నాయకులతో శ్రీరామ్ భేటి అయ్యారు. ఈ కార్యక్రమంలో చిత్రవాండ్లపల్లి, సానేవారిపల్లి, దొరిగిల్లు, గాండ్లవారిపల్లి, పీసీ రేవు గ్రామాలకు చెందిన నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా శ్రీరామ్ మాట్లాడుతూ ముదిగుబ్బ మండలంలో వైసీపీ నాయకుల అరాచకాలతో ఎంతో మంది ఇబ్బంది పడుతున్నారని.. వారందరికీ మనం అండగా నిలవాలన్నారు. గతంలో వైసీపీ నాయకులను నమ్మి ఇక్కడి ప్రజలు ఓట్లు వేసి మోసపోయారన్నారు. ఇప్పుడు ఇంటి స్థలం దగ్గర నుంచి అన్ని రకాలుగా ఇబ్బందులు పడుతున్నారన్నారు. కొందరు నాయకులు గ్రామాల్లో పెత్తనం చేస్తూ తెలుగుదేశం పార్టీ సానుభూతిపరులనే కాకుండా వైసీపీ శ్రేణులను కూడా తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. ఇలాంటి వారికి మనం అండగా నిలవాల్సిన అవసరం ఉందని శ్రీరామ్ అభిప్రాయపడ్డారు. 2019ఎన్నికల్లో పార్టీ ఓటమి తరువాత ఎక్కువగా ఇబ్బంది పడిందని ముదిగుబ్బ ప్రాంతం వారేనన్నారు. వారికి అండగా నిలబడే నాయకుడు లేక చాలా కష్టాలు పడ్డారన్నారు. పార్టీ కోసం ఎన్ని ఇబ్బందులు వచ్చినా ధైర్యం నిలబడ్డారని.. అలాంటి వారిని పార్టీ ఎప్పటికీ గుర్తుంచుకుంటుందన్నారు
.
ఇప్పుడు టీడీపీ సానుభూతిపరులే కాకుండా సామాన్యులు ఎక్కడ ఇబ్బంది పడ్డా మనం ఉన్నామనే భరోసా ఇవ్వాలన్నారు. ఎదుట ఎంతటి వారున్నా తగ్గే ప్రసక్తే లేదని.. అవసరమైతే నేనే ఇక్కడి వచ్చి కూర్చుంటానని భరోసా ఇచ్చారు. గతంలో పార్టీ కోసం కష్టపడ్డవారిని, ఇప్పుడు కొత్తగా పార్టీలోకి వస్తున్న వారిని, పార్టీకి దూరంగా ఉండి మళ్లీ యాక్టీవ్ అవుతున్న వారికి అన్ని విధాలుగా సముచిత స్థానం కల్పిస్తామని… వారికి ఏ కష్టం వచ్చినా.. మేమున్నామనేది మరవద్దని శ్రీరాం సూచించారు. ముదిగుబ్బ మండలంలో వైసీపీ నాయకుల అరాచకాలను, వారు నిర్మించుకున్న కోటలను కూల్చే రోజలు దగ్గర్లోనే ఉన్నాయని శ్రీరామ్ అన్నారు. ఇందుకోసం పార్టీ శ్రేణులంతా సమిష్టిగా పని చేయాలని సూచించారు….