Monday, November 18, 2024

పార్థీ గ్యాంగ్‌ ను పట్టుకోవాలనుకుంటే…రాళ్లదాడులే…

అనంతపురం, ప్రభన్యూస్‌ బ్యూరో : మనిషికి మాన, ప్రాణ, ధన, ఆస్తుల రక్షణ కల్పించడానికి రాజ్యంగం ద్వారా ఏర్పాటు చేసుకున్నదే పోలీస్‌ (రక్షక) వ్యవస్థ. రక్షక భుటులు అని సార్థక నామధ్యేయాన్ని ఏర్పాటు చేశారు. ఒక పోలీసు వెయ్యి మందితో సమానం. ఒక లాఠీ వేల మందిని నియంత్రించగలదు. ఇటువంటి పరిస్థితుల్లో పోలీసులు ఏదైనా సంఘటన జరగక ముందే నిఘావ్యవస్థ ద్వారా నిలువరించాలి. ప్రమాదం జరిగిన తర్వాత ఉరుకులు పరుగులు పెట్టే కన్నా.. ముందస్తుగా వాటిని నియంత్రిస్తే ప్రజల మాన, ప్రాణాలకు ఢోకా ఉండదు. కదిరి సంఘటనలో పోలీసులు ఉపాధ్యాయురాలి హత్య తర్వాత వేగంగా స్పందించారు. అంతకు మునుపే కొన్ని చర్యలు చేపట్టి ఉంటే ఈ ఘోరం జరిగి ఉండేది కాదని మేధావి వర్గాల అభిప్రాయం. కదిరిలో పోలిస్టేషన్ల మార్పుతోపాటు, శివారు కాలనీల్లో సీసీ కెమెరాల ఏర్పాటు, వాటికి సంబంధించిన పనితీరు గురించి క్షుణ్ణంగా అధ్యయనం చేయడం లాంటి విషయాలపై దృష్టిసారించాల్సిన అవసరం ఉంది. ధనవంతులు నివశిస్తున్న ఎన్‌ జి ఓ కాలనీలో ఒక సీసీ కెమెరా ఏర్పాటు చేయలేదంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. కనీసం ఆయా ఇళ్ల యజమానులను సంప్రదించి వత్తిడి తెచ్చిఉంటే కెమెరాలు పెట్టడం పెద్దపని కాదు. అలా అని పోలీసులపైనే పూర్తి బాధ్యత వదలిపెట్టడం తప్పు. కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి విలాసవంతమైన భవనాలు కట్టుకున్నవారు కనీసం సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకునే ఆలోచన లేకపోవడం విడ్డూరంగా ఉంది. అందరూ చదువుకున్నవారు ఉన్నప్పటికీ సామాజిక బాధ్యతను తీసుకోకపోవడంతో ఒక నిండు ప్రాణం.. ఎందరో విద్యార్థులకు విధ్యా దానం చేసిన ఉపాధ్యాయురాలు అర్ధాంతరంగా తనువుచాలించారు. ప్రస్తుతం సంఘటన జరిగిన తర్వాత పోలీసులు కంటిమీద కునుకు లేకుండా నిందితులను పట్టుకోవడానికి పలు ప్రాంతాలకు పరుగులు పెట్టారు.
కొండెక్కి పోలీసులపై రాళ్లదాడి చేసే పార్థీ గ్యాంగ్‌ :
కదిరి ఎన్జీఓ కాలనీలో హత్యకు గురై, బంగారాన్ని దోచుకెళ్లిన అనుమానిత గ్యాంగుల్లో పార్థీ గ్యాంగ్‌ పేరు ముఖ్యంగా వినిపిస్తోంది. మరికొన్ని గ్యాంగులున్నా పోలీసులు వీరిపై ఎక్కువ దృష్టిపెట్టారు. మహారాష్ట్ర, మధ్య ప్రదేశ్‌ తదితర ప్రాంతాలకు బృందాలు వెళ్లారు. అక్కడ పోలీసులు వీరిని పట్టుకోవడానికి అనేక కష్టాలు పడాల్సిందే. గతంలో ఈ గ్యాంగులు జిల్లాలో దోపిడీలు చేసిన సంఘటనలు అనేకం ఉన్నాయి. మహారాష్ట్రలోని షోలాపూర్‌ సమీపంలోని మోహల్‌, మంతి తాలుకాల్లోని చాలా గ్రామాల్లో పార్థీ గ్యాంగ్‌ సభ్యులు ఉంటారు. ఇక్కడి నుంచి విచారణ కోసం వెళ్లిన పోలీసులకు అక్కడి పోలీసులు ఏమాత్రం సహకరించరు. పైగా ఆంధ్రా పోలీసులు వచ్చారని ముందస్తుగా సమాచారం ఇస్తారు. పార్థీ అన్నది ఆ ప్రాంతంలో ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన వారు వీరంతా ఒక జట్టుగా ఉంటారు. అక్కడి రాజకీయ నాయకులతో సన్నిహిత సంబంధాలు ఉంటాయి. నేరం చేసి వెళ్లిపోయిన తర్వాత ఆధారాలతో సహా వెళ్లినా వారిని పట్టుకురావడం గగనమే అవుతుంది. ఆ గ్రామాలకు చుట్టుకొండలు ఉంటాయి. పట్టుకునేందుకు వెళ్లిన పోలీసులకు చిక్కకుండా కొండలు ఎక్కి, అక్కడి నుంచి ఆడ, మగ వారు రాళ్లతో పోలీసులపై దాడులు చేస్తారు. పదిరోజులు, నెల రోజులున్నా వారు కిందకు దిగరు. అక్కడే మకాంపెట్టి రాత్రి, పగలు గడుపుతారు. మహారాష్ట్రలో పూర్తీ స్థాయి సహకారం అందక చాలా మంది వెనుతిరిగి వచ్చిన సందర్భాలున్నాయి. ఈ గ్యాంగ్‌ ఇళ్లమీదే కాకుండా పలుమార్గాల్లో దోపిడి చేస్తుంది. ముఖ్యంగా రైళ్లలో ప్రయాణిస్తూ సిగ్నల్‌ వ్యవస్థకు సంబంధించిన వైర్లు కట్‌ చేసి..రైలు నిలిచిన తర్వాత గుంపులు, గుంపులుగా దాడులు చేసి ప్రయాణికుల వద్ద బంగారు, నగదు దోచుకెళ్తారు. అనంతపురం శివారులోని గార్లదిన్నె, తాటిచెర్ల తదిర ప్రాంతాల్లో గతంలో ఈ రకమైన దొంగతనాలకు పాల్పడ్డారు. రైళ్ల‌లో కిటికీ పక్కన పడుకున్నవారి మెడలో చైన్లు లాక్కుపోవడం, వారిని చంపేయడం లాంటి దుశ్చర్యలకు పాల్పడుతారు. 2013-14 ప్రాంతంలో తాటిచర్ల, గార్లదిన్నె వద్ద రైళ్లలో దోపిడీలు జరిగాయి. రైల్వే పోలీసులపై దాడులు చేశారు. విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు అక్కడికి వెళ్లి దుండగులపై కాల్పులు జరిపారు. అక్కడి నుంచి ఉడాయించిన దొంగల కోసం పోలీసులు షోలాపూర్‌ వరకు వెళ్లగా.. అప్పట్లో మహిళలంతా కత్తులు, గడ్రాలు తీసుకుని పోలీసుల పై దాడులకు తెగబడ్డారు. ఇలా పార్థీ గ్యాంగ్‌ మహారాష్ట్రలో ముఖ్యంగా షోలాపుర్‌ గ్రామంలో పేరు మొసిన గ్యాంగ్‌గా గుర్తింపు ఉంది. 2016 ప్రాంతంలో మరోసారి ఈ గ్యాంగ్‌ రైళ్ల దోపిడీలకు పాల్పడింది. అప్పట్లో పోలీసులు రైల్వే డీజీపీ స్థాయి అధికారులతో మహారాష్ట్ర పోలీసుల పై ఒత్తిడి తెచ్చి ఒక ముఠాను పట్టుకున్నారు. వారి నుంచి సుమారు 100 తులాల దాకా బంగారాన్ని రికవరీ చేయగలిగారు.
విచారణకు సహకరించరు.. కిరాతకంగా ఉంటారు..
పోలీస్‌ విచారణకు ఈ గ్యాంగ్‌ సభ్యులు ఏమాత్రం సహకరించరు. చూసేందుకు బక్కచిక్కి ఉంటారు. మామూలుగా పోలీస్‌ ఇంట్రాగేషన్‌ లో ఏ విధమైన ఒత్తిడి తెచ్చినా చిన్న సమాచారం కూడా బయటకు పొక్కనివ్వరు. హిందీ తప్ప మరో భాష మాట్లాడని వీరు చాలా కఠినంగా ఉంటారు. ఎవరికీ చిక్కకుండా పరిగెత్తడంలో వీరు ఆరితేరి ఉంటారు. మహిళలతో కలిసి రెక్కి చేసే సమయంలో ఆ ప్రాంతంలో కుక్కలు ఎక్కువుగా ఉంటే మొదట వాటిని విషం పెట్టి చంపేస్తారు. తర్వాత దొంగతనాలకు పాల్పడుతారు. భయోత్సాతం సృష్టించేందుకు మనుషులను హతమార్చేస్తారు. ఇలా కదిరి సంఘటనలో ఉపాధ్యాయురాలి పై దాడి జరిగి ఉండొచ్చని ఓ సీనియర్‌ పోలీస్‌ అధికారి తెలిపారు. ఈ గ్యాంగే కాకుండా స్థానిక గ్యాంగుల ప్రమేయం కూడా ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు.
మహరాష్ట్ర – మధ్యప్రదేశ్‌కు వెళ్లిన పోలీస్‌ అధికారులు :
సీసీఎస్ డీఎస్పీ మహబూబ్‌ బాషా నేతృత్వంలో హిందూపురం రూరల్‌ సిఐ హమీద్‌ ఖాన్‌ మిగిలిన పోలీస్‌ అధికారులుగా రెండు బృందాలుగా మహారాష్ట్ర షోలాపూర్‌, మధ్యప్రదేశ్‌ ప్రాంతాలకు విచారణ కోసం వెళ్లారు. వారు ఈ కేసులో ఏమేరకు పురోగతి సాధిస్తారో చూడాలి. ఇదే విధంగా స్థానిక, ఇతర గ్యాంగ్‌ల గురించి ఆరాదీస్తున్నారు. ఇందు కోసం ఎస్పీ కొన్ని బృందాలను దర్యాప్తు కోసం ఏర్పాటు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement